బిపర్‌జోయ్ కలవరం

బిపర్‌జోయ్ కలవరం
  • ముంచుకొస్తున్న ముప్పు
  • నేడు కచ్​లో తీరం దాటే చాన్స్​
  • సముద్రంలో భారీగా ఎగిసి పడుతున్న అలలు
  • గుజరాత్ తీరాలకు రెడ్ అలర్ట్
  • 8 రాష్ట్రాలకు రెయిన్ వార్నింగ్
  • లక్షద్వీప్,  కేరళ, కర్ణాటకలో వానలు 
  • రంగంలోకి 17 ఎన్‌డీఆర్ఎఫ్  బృందాలు 

న్యూఢిల్లీ: బిపర్‌జోయ్ తుఫాన్ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. శక్తివంతమైన ఈ తుఫాన్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్‌ జఖావూ పోర్టులో గురువారం తీరం దాటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, పెను విధ్వంసం సష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్‌‌కు హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్‌ తీరప్రాంతాలలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 17 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను అధికార యంత్రాంగం రంగంలోకి దింపింది. సముద్ర తీర ప్రాంతాల నుంచి ఇంతవరకూ 37 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించామని గుజరాత్ అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు సముద్రంలో చేపల వేటను నిలిపేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడం, అలలు ఎగసిపడుతుండటంతో ఓడరేవులను మూసేశారు. ఓడలకు లంగరు వేశారు. ద్వారక జిల్లాలో 400 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. తీరప్రాంతాలలో అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జఫ్రాబాద్‌లోని షెల్టర్లకు తరలించిన షియల్‌బేట్ గ్రామస్తులకు నిత్యావసరాలను అమ్రేలి పోలీసులు సరఫరా చేశారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా బిపర్‌జోన్ తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతను సమీక్షించారు. ఒక్క మరణం కూడా సంభవించకుండా, నష్టం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

మిగతా రాష్ట్రాలలోనూ

వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం గుజరాత్‌తో పాటు రాజస్థాన్‌లోనూ బిపర్‌జాయ్ ప్రభావం కనిపించనుంది. జోధ్‌పూర్, ఉదయ్‌పూర్‌ డివిజన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. నైరుతి రాజస్థాన్‌లో శుక్రవారం గంటకు 45-–55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. శనివారం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అజ్మేర్‌లోనూ ఈ ఎఫెక్ట్ పడనుంది. మధ్యప్రదేశ్‌లోనూ షాహ్‌దోల్, జబల్‌పూర్, భోపాల్, నర్మదాపురం ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో థార్, బాలాఘట్, రత్లాం జిల్లాలో వేడి గాలులు వీచే అవకాశముంది. గోవాపైనా ఈ తుపాన్ ఇంపాక్ట్ పడనుంది. ఇప్పటికే ఇక్కడ తుపాను ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. టూరిస్ట్‌లు ఎవరూ బీచ్‌లకు వెళ్లకుండా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశ రాజధాని ఢిల్లీలో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.