అర్వింద్​.. సంజయ్​ మధ్యలో ‘ఢీ’ఎస్​

అర్వింద్​.. సంజయ్​ మధ్యలో ‘ఢీ’ఎస్​
  • సీనియర్​ నేత ఇంటి పంచాయితీ
  • ఒక్కరోజులోనే డీఎస్​ బ్యాక్​ స్టెప్​
  • కాంగ్రెస్​లో చేరాంటూ ఆదివారం ప్రకటన
  • రాజీనామా చేస్తున్నానంటూ మరునాడే లేఖ
  • తమ్ముడు అర్వింద్​కుట్ర అంటున్న సంజయ్​
  • తన తండ్రికి ప్రాణహానీ ఉందంటూ ఫిర్యాదు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సుదీర్ఘకాలం రాజకీయాల్లో తిరుగులేని నేతగా చక్రం తిప్పిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్​, రాజ్యసభ మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఇంట్లో రాజకీయ పంచాయతీ రోడ్డెక్కింది. డీఎస్​ పార్టీలో చేరడంపై వివాదాలు బహిర్గతమయ్యాయి. తమ్ముడిపై అన్న చిందులేస్తున్నారు. డీఎస్​ మాత్రం ఆందోళనలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఆదివారం నాడు గాంధీభవన్​కు వెళ్లి, పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరుతున్నానని, తాను కాంగ్రెస్ వాదిని అంటూ చెప్పుకొచ్చిన ధర్మపురి శ్రీనివాస్ ఒక్క రోజులోనే మాట మార్చారు. దీనికి ఆధారంగా రాజీనామా లేఖ రాయడం, దానిపై సంతకం చేస్తూ వీడియో తీసుకోవడం, దాన్ని ఆయన భార్య విజయలక్ష్మీ ద్వారా విడుదల చేయడం స్పీడ్​గా జరిగిపోయింది. అంతేకాకుండా. కాంగ్రెస్​ పార్టీ నేతలపైనా డీఎస్​ సతీమణి విజయలక్ష్మి ఆరోపణలు చేశారు. పార్టీ నేతలెవ్వరూ తమ ఇంటివైపు రావద్దంటూ చేతులు జోడించి దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. 

ఫ్యామిలీ వార్​
తాజా పరిణామాలతో డీఎస్​ ఫ్యామిలీ రాజకీయ పంచాయతీల్లో నలిగిపోతున్నట్లు స్పష్టమవుతున్నది. తన ఇద్దరి కొడుకుల తీరుతో ఆయన ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ కొడుకు బీజేపీ నుంచి ఎంపీగా ఉండటం, మరో కొడుకు ప్రతిపక్ష కాంగ్రెస్​లో చేరడం వివాదాలను బయటపడేసినట్లైంది. తన పెద్ద కొడుకు సంజయ్​ను తీసుకుని ఆదివారం తానే స్వయంగా  కాంగ్రెస్ పార్టీలో చేరి.. సోమవారం రాజీనామా చేయడం చూస్తుంటే అరవింద్‌ ఒత్తిడితోటే రాజీనామా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

లేఖ.. వీడియో
తాను కాంగ్రెస్​లో చేరలేదని, చేరినట్లుగా వస్తున్న వార్తలలో నిజం లేదని, తనను వివాదాలలోకి లాగవద్దని డి. శ్రీనివాస్​ అన్నారు. తన కుమారుడు సంజయ్​ కాంగ్రెస్​లో చేరారని, ఆయన కోసం గాంధీభవన్​కు వెళ్లానని, నాకు కూడా కండువా కప్పారన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్​లో చేరినట్లుగా భావిస్తే రాజీనామా చేస్తున్నానంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖతో పాటుగా ఒక వీడియోను సైతం విడుదల చేశారు. ఏఐసీసీ చీఫ్​ ఖర్గేకు లేఖ పంపినట్లుగా వెల్లడించారు. డీఎస్​ సతీమణి విజయలక్ష్మి మాట్లాడుతూ రాజకీయాల కోసం డీఎస్​ను వాడుకోవద్దని, ఇప్పటికే ఆయనకు ఓసారి బ్రెయిన్​ స్ట్రోక్​ వచ్చిందన్నారు. కాంగ్రెస్​ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నానని, తమ ఇంటి వైపు రావద్దని కోరారు. ఈ లేఖను డీఎస్​ సతీమణి లేఖను మీడియాకు విడుదల చేశారు. 

ఇదంతా అర్వింద్​ కుట్ర
ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆయన కుమారుడు డి.సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్‌పై కుట్ర జరుగుతోందని, ఆయనకు ప్రాణహాని ఉందని, ఆయన చుట్టూ ఉన్న వాళ్లపై తనకు అనుమానం ఉందని అన్నారు. నాన్నను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బ్లాక్ మెయిల్ చేసి లేఖపై సంతకం చేయించారని, ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారని ఆరోపించారు. తండ్రి డీఎస్ రాజీనామా చేసిన సంతకం కూడా ఫేక్ అని, డీఎస్‌ను రూమ్‌లో బంధించి సంతకం చేయించుకున్నారని అన్నారు. మా నాన్న ఫోన్ కూడా లిఫ్ట్ చేయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జనం అంతా గమనిస్తున్నారని,  బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు రాయించుకున్నారని, దీని వెనుక ఎంపీ అర్వింద్ ఉన్నారని విమర్శించారు. మా అమ్మకు రాజకీయాలు తెలియవని, తన తమ్ముడు, ఎంపీ అర్వింద్ మాటలు నమ్ముతుందన్నారు.

ఆయనతో లాభమేంది​
డీఎస్ చేరిక, రాజీనామాపై కాంగ్రెస్ నేతలు  స్పందించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనకే సమాచారం లేదని, ఎవరిని అడిగి చేర్చుకున్నారో కూడా తెలియదని మహేశ్​ గౌడ్​ అన్నారు. డీఎస్ చేరిక వల్ల పార్టీకి వచ్చే లాభం లేదని, సంజయ్‌కి అర్బన్ టికెట్ హామీ ఎవరిచ్చారో క్లారిటీ లేదన్నారు. తనకు కూడా సమాచారం లేదని డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి అన్నారు. నిజామాబాద్​ అర్బన్ టికెట్ హామీ ఇచ్చారని, రాజకీయాల్లో క్యారెక్టర్ అనేది చాల ముఖ్యం అని అన్నారు. చేరడానికి ఒక గంట ముందు సమాచారమిచ్చారని, డీసీసీ అధ్యక్షుడు లేకుండా ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇక, డీఎస్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. డీఎస్‌ను తాము పార్టీలోకి ఆహ్వానించలేదని, గతంలోనే ఆయన కొడుకు సంగతి ఏంటని తాను ప్రశ్నించానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. ఇంటి సమస్యలు ఇంట్లో తేల్చుకోవాలని, కుటుంబవ్యవహారాన్ని పార్టీకి ఆపాదించడం సరికాన్నారు.