ప్రాణం పోతేనే పట్టించుకుంటారా..?

ప్రాణం పోతేనే పట్టించుకుంటారా..?

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రం నుండి జగత్ పల్లి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. నిత్యం ఈ దారిగుండా వాహనదారులు, వ్యవసాయ కూలీలు, వివిధ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఈ బావి మూలమలుపుపై ఉండడంతో అటుగా వెళ్లే ప్రయాణికులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక బావిలో పడే అవకాశాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ దారి గుండా ప్రయాణించాలంటే కత్తి మీద సాము లాంటిదేనని చెప్పొచ్చు.

ఈ బావి రోడ్డుకు అతి దగ్గరగా ఉండడంతో హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు వాపుతున్నారు. గతంలో ప్రమాదకరంగా వ్యవసాయ బావి అనే కథనం ముద్ర దినపత్రికలో ప్రచురితమైంది. కానీ అప్పుడు అధికారులు స్పందించి నామమాత్రంగా తాత్కాలికంగా హెచ్చరిక ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఆ ఫ్లెక్సీ కనిపించక సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణం పోతే కానీ పట్టించుకోరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి శాశ్వతంగా సమస్య పరిష్కారమయ్యేలా హెచ్చరిక బోర్డులను, రక్షణ గోడ లేదా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.