అనుభవాలు రాద్దామనుకున్నారు...

అనుభవాలు రాద్దామనుకున్నారు...
1999 ఎన్నికలకు కొంచెం ముందు అనుకుంటా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్హి సంస్థ లో జరిగే ప్రభుత్వ అధికారుల శిక్షణ కార్యక్రమంలో నేను , ప్రొఫెసర్ కోదండరాం , ప్రభుత్వ న్యాయ సలహాదారు మంచికంటి రాంకిషన్ రావు వక్తలు గా పాల్గొన్నాం. మిత్రుడు జ్వాలా నరసింహా రావు కోఆర్డినేటర్ ఆ కార్యక్రమానికి. ఆ రోజు ప్రధాన వక్త సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామా రావు గారు. సెషన్ ముగియగానే బయట లాంజ్ లో అందరం టీ తాగుతున్నప్పుడు విజయరామా రావు గారిని అడిగాను " ఐ పీ ఎస్ అధికారి గా మీరు సీబీఐ డైరెక్టర్ పదవి దాకా ఎదిగారు , మీ అనుభవాలు రాస్తే బాగుంటుంది " అని. నిజమే అమర్ కానీ రాయడం అలవాటు లేదయ్యా అన్నారు. నేను ఏర్పాటు చేస్తాను మీరు మాట్లాడితే రాసే వాళ్ళను అన్నాను. చూద్దాం అన్నారు , అక్కడితో అయిపోయింది. చాలా కొద్ది రోజులకే ఆయన తెలుగుదేశం లో చేరి ఖైరతా  బాద్ నుండి గెలిచి మంత్రి అయ్యారు. 2004 లో తెలుగు దేశం ఒడిపోయింది. ఆయనా క్రియాశీల రాజకీయాల నుండి దూరం అయ్యారు.

నేను మాత్రం ఈ 25 ఏళ్లలో వారిని ఎక్కడ కలిసినా ఆనాటి మాటే అడుగుతూ వొచ్చాను " మీ అనుభవాలు రాయాలి సర్ " అని. ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగుండటం లేదు , వయసు కూడా 80 దాటింది . అయిదు రోజుల క్రితం ఒక పెళ్లిలో కలుసుకున్నాం. బాగా వీక్ అయ్యారు. మళ్లీ ఇదే మాట "సర్ ఏమన్నా చెప్తారా రాద్దాం " అన్నాను. చిరునవ్వు సమాధానం. లాభం లేదని వారి కూతురు అన్నపూర్ణ గారిని వెతుక్కుంటూ డైనింగ్ హాల్ కి వెళ్ళాను. వారిని అడిగాను "నాన్నగారి జ్ఞాపకాలు ఏమన్నా రికార్డ్ చేశారా"అని. సత్యనారాయణ అనే ఒక మిత్రుడు రికార్డ్ చేస్తున్నారు అని చెప్పారు. ఆయన్ని కలవాలన్నాను. విజయరామా రావు గారి గురించి నేను రాయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. జర్నలిస్ట్ గా ఆయన తో నాకు చాలా ఆసక్తికరమయిన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు విజయరామా రావు గారు లేరు , సత్యనారాయణ గారి కోసం నా  వెతుకులాట. ఐదురోజుల క్రితం కలిసి మాట్లాడిన విజయరామా రావు గారు ఈ సాయంకాలం కాలం చేశారన్న వార్త విని . . . . వారికి నా శ్రద్ధాంజలి.
-దేవులపల్లి అమర్