విపక్షాల పై ఇంత కోపమా డీఎంఎఫ్టీ నిధుల కేటాయింపు లో ఎమ్మెల్యే వివక్ష

విపక్షాల పై ఇంత కోపమా డీఎంఎఫ్టీ నిధుల కేటాయింపు లో ఎమ్మెల్యే వివక్ష

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు పని తీరుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ లు గుర్రుగా ఉన్నారు. వార్దులలో అభివృద్ధి పనుల కోసం  సమానంగా నిధులు కేటాయించవలసిన ఎమ్మెల్యే వివక్షత చూపడం విమర్శలకు దారి తీసింది. డీఎంఎఫ్ టీ మంచిర్యాల నియోజక వర్గంకు 30 కోట్లు మంజూరు అయ్యాయి. మంచిర్యాల, నస్పూర్ పురపాలక సంఘాల్లో 547 పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపారు. అందులో471 పనులకు అనుమతి లభించి 23 కోట్ల 24లక్షలు మంజూరు చేశారు. 76 పనులను సాంకేతిక కారణాలతో అనుమతించలేదు. ఆయా వార్డులలో నిధులు అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇక్కడే ఎమ్మెల్యే వివక్షతను ప్రదర్శించారని కాంగ్రెస్ కౌన్సిలర్ లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ లు ప్రాతినిధ్యం వహించే వార్డులలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించ లేదు. ధీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మున్సిపల్ అధికార పక్ష పాలనను నిలతీసినందుకు తమ వార్డుకు నిధులు కేటాయించడం లేదని వాపోయారు. వార్డులలో రహదారులు, మురికి కాలువలు ఇతర మౌలిక సదుపాయాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

వివక్షతపై ప్రజల్లోకి వెళతాం ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు నిధుల కేటాయింపు లో చూపుతున్న వివక్షత పై ప్రజల్లోకి వెళ్లి ఎండకడతామని మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్ తెలిపారు. నిధులు కేటాయించకపోతే అభివృద్ధి పనులు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. తమపై ఉన్న కక్షతో అభివృద్ధి పనులు జరగగకుండా అడ్డుకోవడం శోచనీయమన్నారు.