కాలేశ్వరం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం -ప్రొఫెసర్ కోదండరాం ధ్వజం 

కాలేశ్వరం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం  -ప్రొఫెసర్ కోదండరాం ధ్వజం 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత విధానాలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కోదండరామ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం  ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విధ్వంసానికి గురైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. లాభం కంటే మంచిర్యాల జిల్లాకు నష్టం ఎక్కువ  జరుగుతుందని ఆయన అన్నారు. గత ఏడాది వర్షాల వల్ల వందలాది ఎకరాలు, గృహాలు నీట మునిగాయని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం కాకుండా తుమ్మడిశెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు పరంగా ఎంతో మేలు జరిగేదని ఆయన అన్నారు.  వరద నీరు కింద పారితే ఆ నీటిని తిరిగి పైకి ఎత్తిపోతల పథకం ద్వారా పారించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఓరకంగా చూస్తే కేసీఆర్ పాలన నిర్ణయాలు చూస్తే తుగ్లక్ తో  పోలిక సరిపోదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం నీటిని ఇతర జిల్లాలకు తరలింపు చేయడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. నీటిని మల్లన్న సాగర్ లో నింపుతూ అక్కడి నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు ప్రత్యామ్నాయంగా మరో చెరువు నిర్మిస్తామని ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర  తిరగతీయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే ముందు చివరిసారిగా కేసీఆర్ ని వ్యక్తిగత కార్యక్రమం కోసం ఆహ్వానించేందుకు కలిసినప్పుడు తుమ్మడిశెట్టి వద్దనే ప్రాజెక్టు నిర్మించాలని తాను సూచించానని ఆయన చెప్పారు. అయితే కేసీఆర్ మాత్రం తుమ్ముడి హేట్టి, కాళేశ్వరం రెండు నిర్మిస్తామంటూ నమ్మబలికి చివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం తలపెట్టారని ఆయన ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ విధానాలను, పాలనను తిరస్కరించి ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేవీ.ప్రతాప్,  న్యాయవాది నైనాల గోవర్ధన్ , న్యూడెమోక్రసి నాయకుడు టీ.శ్రీనివాస్, బాబన్న తదితర నేతలు పాల్గొన్నారు.