‘లిక్కర్’​ మనీతో ఆస్తులు

‘లిక్కర్’​ మనీతో ఆస్తులు
  • కవిత ప్రమేయం ఉందన్న ఈడీ 
  • అరుణ్ పిళ్లయి ఆమె ప్రతినిదేనని వాదన 
  • విచారణ జూన్ రెండుకు వాయిదా
  • సిసోడియాకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
  • తన చార్జిషీటులో కవిత పేరు తొలగించిన సీబీఐ
  • దీంతో కేసు చుట్టూ ముసురుకుంటున్న అనుమానాలు


ముద్ర, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్​స్కామ్ కేసులో ఈడీ మరోసారి బలమైన వాదనలు వినిపించింది. బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవితకు స్కామ్ తో లింకులున్నాయని, ఇందులో వచ్చిన సొమ్ముతోనే ఆస్తులు కూడబెట్టారని ఆరోపించింది. ఢిల్లీలో మద్యం పాలసీ ద్వారానే స్కామ్ చేశారని, ఇందుకు సంబంధించిన చర్చలలో కవిత తరపున ప్రతినిధిగా అరుణ్​ పిళ్లై హాజరయ్యారని వెల్లడించింది. స్కామ్ లో కవిత ప్రమేయం ఉందంటూ ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో పదే పదే వాదించారు. ఇదే కేసులో ఆప్​నేత మనీశ్​ సిసోడియాకు బెయిల్​ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇటీవల కోర్టులో సీబీఐ దాఖలు చేసిన తాజా చార్జిషీటులో మాత్రం కవిత పేరును ప్రస్తావించలేదు. దీంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందోననే అనుమానాలు మొదలయ్యాయి.

కవితకు లిక్కర్​మనీ
ఢిల్లీ లిక్కర్​ పాలసీ ద్వారా కవిత వేల కోట్లు సంపాదించారని ఈడీ ఆరోపించింది. దీని ద్వారా వచ్చిన లాభాలతో ఆస్తులు కొనుగోలు చేశారని కోర్టుకు వెల్లడించింది. అరుణ్​ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్​పై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అతడికి బెయిల్​ఇవ్వరాదని వాదిస్తూనే కవిత అంశాన్ని ఈడీ మరోసారి ఉటంకించింది. కవిత ప్రతినిధిగా వ్యవహరించానని, పిళ్లై ఒప్పుకున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. పిళ్లై వాంగ్మూలం అధారంగానే కవితను తాము విచారించామని, ఆమెదే కీ రోల్ అని గుర్తించామని,​కవిత నేతృత్వంలోనే కొన్ని సమావేశాలు జరిగాయని వెల్లడించారు. సౌత్​ గ్రూప్​కు కవిత నాయకత్వం వహించారని, ఈ స్కామ్ లో వందల కోట్లు చేతులు మారాయని, కవిత, భర్త అనిల్, ఆడిటర్​ బుచ్చిబాబు హైదరాబాద్ లో పాటు ఇతర ప్రాంతాలలో ఆస్తులు కొన్నారని ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో అరుణ్​ పిళ్లై కీలకంగా ఉన్నందున బెయిల్​ఇవ్వద్దని వాదించింది. తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని పిళ్లై తరపు న్యాయవాది కోరడంతో జస్టిస్​ నాగ్​పాల్​ అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను జూన్ రెండుకు వాయిదా వేశారు. 

సిసోడియాకు నో బెయిల్​
మనీశ్ సిసోడియాకు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఆయన సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ వ్యాఖ్యానించారు. సిసోడియా పలుకుబడిగల నేత అని, ఆయన అధికారులను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్నారని, సాక్షులలో ఎక్కువ మంది ప్రభుత్వోద్యోగులు కాబట్టి, వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని సీబీఐ విన్నవించింది. దీంతో సాక్షులను ప్రభావితం చేస్తారనే అంశాన్ని తోసిపుచ్చలేమని  కోర్టు అభిప్రాయపడింది. సిసోడియా డబ్బుకు సంబంధించిన ఆధారాలేవీ దొరకలేదని న్యాయవాదులు వాదించారు. సిసోడియా విచారణకు సహకరించడం లేదని, తప్పించుకునేందుకు ప్రయత్నించారని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని సీబీఐ న్యాయవాదులు వాదించారు. సిసోడియా రాజకీయ కక్ష సాధింపు బాధితుడని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని, దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు సిసోడియా బెయిల్​ పిటిషన్​ను కొట్టేసింది.