బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది. మహిపాల్ రెడ్డి సోదరులు ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. సంతోష్ గ్రానైట్స్ పేరుతో అక్రమ మైనింగ్ చేస్తున్నారని మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఈడీ నిఘా పెట్టింది. తనిఖీల్లో భారీగా నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీన పరుచుకుంది.గూడెం బ్రదర్స్ ఇంటితో పాటు లక్డారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమలో ఈడీ సోదాలు జరిపింది. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి గూడెం మధుసూదన్ రెడ్డి యజమానిగా ఉన్నారు. భూగర్భగనుల శాఖకు భారీ మొత్తంలో సీనరేజిని ఎగవేసినట్లు మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.

72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించారు మధుసూదన్ రెడ్డి. సీనరేజి, పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డికి 341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు మధుసూదన్ రెడ్డి. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తమ విచారణలో గుర్తించారు.