గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: మంత్రి సత్యవతి రాథోడ్

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: మంత్రి సత్యవతి రాథోడ్

కొండమల్లే పల్లి, కేశ్యా తండ, గుర్రపు తండ లలో రోడ్డు పనులకు శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి, నల్లగొండ: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలో కొండ మల్లేపల్లి, దేవరకొండ, దామరచర్ల, అడవి దేవుల పల్లి మండలాల్లో పలు అభివృద్ది పనుల శంఖు స్థాపనలు, పలు పనులను ప్రారంభం చేయడానికి ముఖ్య అతిథిగా ఆమే హాజరై పిడబ్ల్యుడి రోడ్లు, బిటి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రజాభివృద్ధి కొరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో ఉన్న కులాలను గౌరవిస్తూ వారి వృత్తులకు అవసరమయ్యే పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని ఆదరించి మూడోసారి కెసిఆర్ ను సీఎం చేసి మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. అంతకు ముందు ఆమెకు జిల్లా కలెక్టర్ అర్వి కర్ణన్, ఎస్పి అపూర్వ రావు, దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్, ట్రై కార్ చైర్మన్ రాం చంద్ర నాయక్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ లు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అర్డిఓ శ్రీ రాములు, జిల్లా గిరిజన అభివృద్ది అధికారి రాజ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణ వేణి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.