డిసెంబర్​లో ఎన్నికలు?

డిసెంబర్​లో ఎన్నికలు?
  • అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్!
  • ఈసీ తెలంగాణ టూర్ తరువాతే షెడ్యూల్ విడుదల
  • జమిలి లేకపోవడంతో షెడ్యూల్ ప్రకారమే ఎలెక్షన్స్


ముద్ర, తెలంగాణ బ్యూరో : డిసెంబర్ లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని తెలుస్తోంది. ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణకు తమ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. నిన్నమొన్నటి వరకు జమిలి, మినీ జమిలి ఎన్నికలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఇందుకు ఊతమిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో చిట్ చాట్ చేస్తూ రాష్ట్రంలో ఏప్రిల్ లేదా మేలో జమిలి ఎన్నికలే జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై  కొంతమేర గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం కేంద్రం నిర్వహిస్తున్న పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించే అవకాశముందన్న ప్రచారం కూడా సాగింది. 

రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ..

జమిలి ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీ కూడా వేసింది. కమిటీ తొలి సమావేశం కూడా జరిగింది. దీంతో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం కాకుండా ఏప్రిల్లో పార్లమెంటు ఎన్నికలతో పాటు జరుగుతాయనే చర్చ మొదలైంది. ఆ తర్వాత కేంద్రం మహిళా బిల్లును ప్రవేశపెట్టడంతో రిజర్వేషన్లు ఖరారు చేశాక ఎన్నికలు నిర్వహిస్తారని, ఈ క్రమంలో ఆరునెలల వరకు జాప్యం జరగొచ్చనే మరో చర్చ తెరమీదకు వచ్చింది. దీనికి కేంద్రం వెంటనే తెరదించుతూ, 2029 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇక జమిలిపై  కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఈసీ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

అక్టోబర్​3 నుంచి తెలంగాణలో ఈసీ పర్యటన..

ఇందులో భాగంగానే ఎన్నికల సంఘం అధికారులు వచ్చే నెల మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలోనే ఉండి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతోపాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై ప్రధానంగా చర్చించనుంది. మరోవైపు ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో కూడా సమావేశం కానుంది. ఈ సందర్భంగా డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాల నోడల్ అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షించనుంది. ఇక జిల్లాలవారీగా ఎన్నికల ప్రణాళిక ఏర్పాట్లపై సమీక్షించనుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ, తదితర అధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది. ఆ తర్వాత అధికారులు ఓటర్ల అవగాహనా కార్యక్రమాలపైనా అధికారులు దృష్టి సారించనున్నారు. ఓటర్ల జాబితా, పౌరుల భాగస్వామ్యానికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ ను  ప్రకటించేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్  విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.

అభ్యర్థుల ముమ్మర ప్రచారం..

ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా ప్రకటనలపై మళ్లీ వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో బీఆర్ఎస్ ఇప్పటికే చాలా ముందు వరసగా ఉంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గానూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకంటించారు. కేవలం 4 నియోజకవర్గాలకు మాత్రమే ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొదటి జాబితాలో స్థానం దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులంతా ఇప్పటికే తమతమ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాగా ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్దం అవుతున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్  పార్టీ మొదటి జాబితా ప్రకటించిన వారం, పది రోజుల్లోనే ఆ రెండు పార్టీలు కూడా మొదటి విడత జాబితాలను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఆ రెండు జాతీయ పార్టీలు అలా చేయకపోవడం వల్ల రాష్ట్రంలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్న వాదనకు మరింత బలం చేకూరినట్లు అయింది. అయితే మోడీ ప్రభుత్వం ఇప్పట్లో అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేక పోవడంతో ఎన్నికల సంఘం అధికారులు డిసెంబర్ లోనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.