వైద్య రంగ పురోగ‌తి అభివృద్ధికి నిదర్శనం : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

వైద్య రంగ పురోగ‌తి అభివృద్ధికి నిదర్శనం : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,నిర్మ‌ల్: విద్యా,వైద్య రంగాల పురోగతి అభివృద్ధికి నిదర్శనమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్స‌వాల్లో భాగంగా ఎంసీహెచ్ లో మంగళవారం నిర్వ‌హించిన‌ వైద్య‌, ఆరోగ్య దినోత్స‌వంలో  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా   డాక్టర్లకు, ఆశ వర్కర్లు, వైద్య బృందాలకు ప్రొఫెసర్లకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో బాలింత‌ల‌కు  కేసీఆర్ కిట్ల‌ను అంద‌జేశారు. పండ్లు పంపిణీ చేశారు. అనంత‌రం రూ. 23.75 కోట్ల వ్య‌యంతో నిర్మించనున్న 50 ప‌డ‌క‌ల క్రిటిక‌ల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త‌గా ఏర్ప‌డ్డ నిర్మ‌ల్ జిల్లా  వైద్య రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింద‌న్నారు. . ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామ‌ని తెలిపారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేసిందని చెప్పారు. అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తేవడంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలను కూడా ఉచితంగా  అంద‌జేస్తున్నామ‌ని వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఏంసీహెచ్ లో ఇప్పుడున్న 50 ప‌డ‌క‌ల‌కు అద‌నంగా రూ. 50 ల‌క్ష‌ల వ్యయంతో  మ‌రో 30 ప‌డ‌క‌ల‌తో దీన్ని 80 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. జిల్లా ఆసుప‌త్రితో పాటు ఇత‌ర ద‌వాఖానాల్లో మొత్తం 450 ప‌డ‌క‌లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయ‌ని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.