విశాఖ నుంచి లక్ష్మినారాయణ పోటీ

విశాఖ నుంచి లక్ష్మినారాయణ పోటీ


సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌ సభ సభ్యునిగా పోటీ చేయాలని నిర్ణయిచుకున్నారు. ఆయన స్వచ్చంద సంస్థ జాయిన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ జేడీ సర్వసభ్య  సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పలు పార్టీలు జేడీ లక్ష్మినారాయణకు ఆహ్వానం పలికాయని కానీ సిద్ధాంతాలు కలవకపోవడం వల్ల ఏ పార్టీలోనూ చేరకూడదని నిర్ణయించుకున్నారని ప్రకటించారు. విశాఖ నుంచే పోటీ చేస్తానని  వీవీ లక్ష్మీనారాయణ కొంత కాలంగా చెబుతున్నారు.

విశాఖపట్నం ప్రజలు తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇచ్చారని అందుకే మళ్లీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు  చెబుతున్నారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పటికీ తన భావజాలానికి అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీకి మద్దతుగా ఇస్తానని తెలిపారు. త్వరలో తన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. గత ఎన్నికల్లో జనసేన తరుపున విశాఖ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన లక్ష్మీనారాయణ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన జనసేనకు రాజీనామా చేశారు.  గతంలో సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ఆ తరువాత పాలిటిక్స్‌ లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో లక్షీనారాయణకు 2,88,874 ఓట్లు పోలయ్యాయి.  

టీడీపీ నుంచి పోటీ చేసిన బాలయ్య చిన్న అల్లుడు భరత్‌ కు 4,32,492 ఓట్లు పోలయ్యాయి. ఇక, వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు రాగా, ఆయన విజయం సాధించారు. ఈ సారి పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ..టీడీపీ ` జనసేన కలిస్తే విశాఖ ఎంపీ సీటు కైవసం అవుతుందనే అంచనాలు రెండు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. కానీ, పొత్తు గురించి రెండు పార్టీల్లో అంతర్గతంగా చర్చ సాగుతున్నా.. అధికారికంగా మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. విశాఖ నుంచే పోటీ చేయాలనుకుంటున్న లక్ష్మినారాయణ మళ్లీ జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ ఇప్పటికే కార్మికులకు మద్దతుగా ఏపీ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసారు. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక, స్థానికంగా తన మద్దతు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా తనకు విశాఖలోని సవిూకరణాలు కలిసి వస్తాయని లక్ష్మీనారాయణ అంచనాతో ఉన్నారు. అందుకే ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.