రెండు పథకాల గడువు పెంపు

రెండు పథకాల గడువు పెంపు
  • సీనియర్లకు ఎస్​బీఐ సదావకాశం

ముంబై:  ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కూడా వృద్ధులకు అధిక వడ్డీ అందించేందుకు రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఆయా పథకాల్లో జాయిన్ అవ్వడానికి గడువు తేదీ సమీపించడంతో తాజాగా గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ‘ఎస్‌బీఐ వుయ్ కేర్‌తో పాటు అమృత్ కలశ్’ పథకాల్లో డిపాజిట్లు చేయడానికి గడువు తేదీని పెంచుతున్నట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

ఎస్‌బీఐ వుయ్ కేర్

ఎస్‌బీఐ వుయ్ పథకం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిలో వృద్ధులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ పథకంలో చేరడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించారు. అలాగే తాజా డిపాజిట్లు, మెచ్యూరింగ్ డిపాజిట్ల పునరుద్ధరణపై ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

 
ఎస్‌బీఐ అమ‌ృత్ కలశ్

ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకం చెల్లుబాటును కూడా ఎస్‌బీఐ పొడిగించింది. ఈ పథకంలో చేరడానికి దఫదఫాలుగా జూన్ 30, 2023 వరకు పెంచిన గడువును తాజాగా మరోసారి పెంచింది. ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్ చేరడానికి తాజాగా ఆగస్ట్ 15, 2023 వరకూ గడువును పెంచారు. ఈ ఎఫ్‌డీ స్కీమ్ 400 రోజుల ప్రత్యేక వ్యవధితో వస్తుంది, దీనిపై సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ రేటు వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం చాలా మంది ఎఫ్‌డీ పథకాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఎఫ్‌‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి.