Take a fresh look at your lifestyle.

నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు

  • ఏడుగురిని అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ పోలీసులు
  • రూ. 11లక్షల నకిలీ, రూ, 4 లక్షల ఒరిజినల్ కరెన్సీ స్వాధీనం

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: నకిలీ కరెన్సీ రాకెట్ ను ఎల్బీనగర్ నగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రూ. 11.50 లక్షలు నకిలీ కరెన్సీ, రూ. 4 లక్షల అసలు కరెన్సీ, 7 మొబైల్ ఫోన్లుఒక హోండా సిటీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం..తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన ఒక వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి కలిసి మొత్తం 8 మంది నకిలీ కరెన్సీ ముఠాను నడుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట శబరి హిల్స్ కాలనీకి చెందిన లో చిన్నోళ్ల మాణిక్యరెడ్డి(49), నల్గొండ జిల్లా దోమలపల్లి మండలం పారాపల్లిగూడెంకు చెందిన మామిళ్ల జానయ్య(34), రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన బిలకంటి భరత్ కుమార్(36), మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన జెల్లా వెంకటేశ్(31), మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన డొంకని సత్యనారాయణ(40),మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల వెంకటేశ్(28. వీరంతా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలోని శబరి హిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా బాపూజీ నగర్, కంచర్లపాలెం చెందిన కె.శివ శంకర్(27), పరారీలో ఉన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన సురేశ్ అలియాస్ సురేశ్ భాయ్ మొత్తం ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్నారు.

  • తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని…

కేసులో ప్రధాన నిందితుడు మాణిక్యరెడ్డి కూకట్‌పల్లి ప్రాంతంలోని నిజాంపేటలో నివాసం ఉండేవాడు. అప్పుడు అతడి భార్య గుండెపోటుతో మృతి చెందారు.అతడి వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది.తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించడానికి నకిలీ కరెన్సీ చలామణి చేయాలని పథకం పన్నాడు.ఈ క్రమంలో ఇతడు ఆన్‌లైన్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నివాసి, నకిలీ కరెన్సీ నోట్లను అమ్మే సురేశ్ అలియాస్ సురేశ్ భాయ్ అనే వ్యక్తిని సంప్రదించాడు. జనవరిలో మాణిక్యరెడ్డి అహ్మదాబాద్‌కు వెళ్లి సురేశ్ రూ. 1లక్ష ఒరిజినల్ కరెన్సీ చెల్లించి,రూ. 11.50 లక్షల నకిలీ కరెన్సీ కొనుగోలు చేశాడు. అనంతరం నకిలీ కరెన్సీ చలామణి చేయడానికి మాణిక్యరెడ్డి తన ప్రణాళికను జానయ్య, జె.వెంకటేశ్, సత్యనారాయణ, భరత్, జి.వెంకటేశ్ కు వివరించాడు. నకిలీ కరెన్సీతోపాటు నకిలీ బంగారం బిస్కెట్లు విక్రయించడానికి కుట్ర పన్నారు. జానయ్య నకిలీ కరెన్సీని కొనుగోలు చేసేవారిని మాణిక్యరెడ్డికి పరిచయం చేసేవాడు. ఇతను రూ. లక్ష అసలు కరెన్సీని తీసుకొని రూ. 4 లక్షలు నకిలీ కరెన్సీ ఇచ్చేవాడు. మాణిక్య రెడ్డి,అతడి అనుచరులు అక్కడి నుంచి పరారయ్యేవారు. గుజరాత్ కు చెందిన సురేశ్ ఈ నెల 11న మాణిక్యరెడ్డికి ఫోన్ చేసి విశాఖపట్నంలోని కంచర్లపాలెం నివాసి శివశంకర్‌ను ఫోన్ ద్వారా పరిచయం చేసి, నకిలీ కరెన్సీ నోట్లు ఇవ్వాలని సూచించాడు.శివశంకర్ ను హైదరాబాద్ కు రావాలని మాణిక్యరెడ్డి చెప్పాడు.ఈ క్రమంలో గురువారం శివ శంకర్ రూ. 4 లక్షల అసలు కరెన్సీతో హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్ ప్రాంతం చింతలకుంటకు వచ్చాడు.చింతలకుంట చెక్‌పోస్ట్ సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ ఎదురుగా మాణిక్యరెడ్డి, అతడి అనుచరులతో వ్యాపారం చేస్తున్నాడు.విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ పోలీసులు మొత్తం ఏడుగురు నిందితులను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారించారు.వీరి నుంచి హోండా సిటీ కారు (నెంబర్ టీఎస్ 08 ఈఎం 1233), 10 నకిలీ బంగారు బిస్కెట్లు, రూ. 11.50 లక్షల నకిలీ కరెన్సీ, రూ. 4 లక్షల అసలు కరెన్సీ, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి,ఏడుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తులో ఎల్బీనగర్ అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు, ఏసీపీ కృష్ణయ్య, సీఐ వినోద్ కుమార్, ఎస్సై నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.