మాయదారి ధరణి

మాయదారి ధరణి
farmers facing issues from Dharani portal
  •  రైతులకు శాపంగా మారిన  పోర్టల్
  •  భూముల భద్రతకు చట్టబద్ధత కరువు
  • అనాలోచితంగా వీఆర్వోల తొలగింపు
  • ప్రక్షాళన ముసుగులో భారీ అక్రమాలు
  • అధికారుల తప్పిదాలకు రైతులు బలి
  • తప్పులు సరిదిద్దడంలో ప్రభుత్వం విఫలం
  • కంప్యూటరీకరణలో అన్నీ లోపాలే
  • ఐదు గుంటలతో ఐదెకరాలకు లాక్

‘సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం శాకారం శివారులోని సర్వే నం.213లో పొన్నాల మైత్రి అనే మహిళా రైతు తన తండ్రి నుండి వారసత్వంగా ఐదెకరాల భూమి వచ్చింది. ఐదు  గుంటల పట్టా భూమి ‘ధరణి’ పోర్టల్ లో సీలింగ్ భూమిగా నమోదు కావడంతో 2022 ఏప్రిల్ లో రికార్డు సవరణకు దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ సిఫారసుతో దానిని సవరించాలని కోరుతూ కలెక్టర్ నాలుగు నెలల క్రితం సీసీఎల్ఎ కు పంపించారు. ఇప్పటికీ మోక్షం లేదు. మైత్రి బ్యాంకు రుణం కోసం మార్టగేజ్ చేసేందుకు ప్రయత్నించగా స్లాట్ బుక్ కావడం లేదు. కేవలం ఐదు గుంటల భూమి సీలింగ్ గా నమోదు కావడంతో మొత్తం ఐదు ఎకరాల భూమిపై ఎలాంటి లావాదేవీలు చేయడానికి వీలు లేకుండా పోయిందని ఆమె వాపోతున్నారు.’

 

ఇది మరో దీన గాథ

వర్గల్ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన వంగ నర్సారెడ్డికి సర్వే నం.96లో 1-36 గుంటల భూమి ఉన్నది. 2017లో రెవెన్యూ ప్రక్షాళనలో జరిగిన తప్పిదం కారణంగా వంగ రాంరెడ్డి పేరు మీద పట్టా మార్పిడి జరిగింది. నర్సారెడ్డి మృతి చెందడంతో అతని వారసులు ఈ భూమిని తమ పేర్ల మీద మార్పిడి చేయాలని కోరుతూ దరఖాస్తూ చేసుకోవడంతో ఈ విషయం బయటపడింది. తమకున్న ఏకైక ఆస్తి తమ ప్రమేయం లేకుండా మరొకరి పేరుమీద పట్టా మార్పిడి జరగడంతో నర్సారెడ్డి కుమారులు సుధాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి లబోదిబోమంటున్నారు.

  ముద్ర, తెలంగాణ బ్యూరో: భూముల క్రమబద్ధీకరణ, జరిగిన పొరపాట్ల సవరణ, పట్టాదారుల రెవెన్యూ రికార్డులకు భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ధరణి’ పోర్టల్ సవాలక్ష సమస్యలతో రైతుల భారంగా పరిణమించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన మరుక్షణమే భూమి కొనుగోలుదారులకు రెవెన్యూ హక్కులు లభిస్తాయన్న ఏకైక అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ లొసుగులను ప్రభుత్వం కప్పిపుచ్చుతున్నది. ‘ధరణి’ పోర్టల్ రూపొందించిన ప్రభుత్వం పొరపాట్ల సవరణ, తలెత్తిన సమస్యలకు పరిష్కారం చూపడంలో ఘోరంగా విఫలమైంది. ఒక సర్వే ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేసిన ‘ధరణి’ పాస్ పుస్తకాలలో 60 శాతం సమస్యాత్మకంగా ఉండడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘ధరణి’ పోర్టల్ భాగోతం ఇది.

 నెరవేరని ఆశలు

భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే హక్కులు లభిస్తాయన్న కొండంత ఆశతో ఉన్న రైతులకు ‘ధరణి’ కల కర్పూరంలా కరిగిపోతున్నది. 1954 నుండి కొనసాగుతున్న లిఖిత పూర్వక రికార్డులను (మాన్యువల్) 2013లో ప్రభుత్వం కంప్యూటరీకరణ చేసింది. అప్పటి నుంచే రెవెన్యూ రికార్డుల చుట్టూ క్రీనీడ మొదలైంది. అప్పటి వరకు పట్వారీలు, వీఆర్వోలు నమోదు చేసిన భూముల వివరాలను కంప్యూటర్ లోకి  అప్ లోడ్ చేసే క్రమంలో అనేక పొరపాట్లు జరిగాయి. తెలుగు నుండి ఇంగ్లిషులోకి అనువదించే క్రమంలో పట్టాదారుల పేర్ల నమోదులో పొరపాట్లు చోటుచేసుకున్నాయి. 2017లో ప్రభుత్వం కంప్యూటర్ రెవెన్యూ రికార్డులను ఆన్లైన్ చేసే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ‘ప్రక్షాళన’ కార్యక్రమం చేపట్టింది. మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలను అధికారికంగా మూసివేసి సిబ్బందిని గ్రామాలకు పంపించి గ్రామసభ సమక్షంలో భూమి రికార్డుల ప్రక్షాళన చేపట్టింది.

 సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం

కొంతమంది రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం కారణంగా రెవెన్యూ రికార్డులలో ఘోరమైన తప్పులు దొర్లాయి. రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి అర్హులైన యజమానులకు పట్టా హక్కులు కల్పించామన్న ప్రభుత్వం 2018లో కొత్తగా పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. అప్పటి నుండి రైతుల కష్టాలు మొదలయ్యాయి. పలువురు రైతులు యేళ్ల తరబడి అనుభవిస్తున్న భూములు పట్టా పుస్తకాలలో ప్రభుత్వ, సీలింగ్ భూములుగా నమోదు కావడంతో వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రికార్డులను కంప్యూటరీకరించే క్రమంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక సర్వే నంబర్ విస్తీర్ణంలో ఎంతోకొంత సీలింగ్ ఉంటే మొత్తం సర్వే నంబర్ ను సీలింగ్ భూమిగా ‘ధరణి’ పోర్టల్ లో నమోదు చేశారు. దీంతో భూములు విక్రయించే రైతులు ఎన్ ఓసీ కోసం ఆర్ డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరికొన్ని సర్వే నంబర్లలో కొందరు రైతుల పట్టా భూములను నిర్లక్ష్యంతో సీలింగ్ భూమిగా నమోదు చేశారు

  కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

వర్గల్ మండలంలోని శాకారం గ్రామంలో పలు సర్వే నంబర్లలోని సుమారు 20 ఎకరాల భూమి విదేశంలో స్థిరపడి గ్రామంలో కొద్దిపాటి భూమి కలిగిన గులాం యాసిన్ పేరుమీద నమోదు అయ్యంది. దీంతో సంబంధిత రైతులు రికార్డుల సవరించుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే మండలం అంబర్ పేట గ్రామంలో మన్నె సత్తయ్య అనే రైతు ఇనాం భూమిని యేండ్ల తరబడి సాగు చేసుకుంటున్నాడు. 37,32,43 సర్వే నంబర్లును ధరణి పోర్టల్ లో ప్రభుత్వ భూములుగా నమోదు చేయడంతో అతడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.

 ప్రభుత్వ భూమి పట్టా భూమిగా

వర్గల్ మండలం శాకారం శివారులోని 202 సర్వే నంబర్ లో 0.31 గుంటల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు 1977లో అసైన్ చేశారు. రెవెన్యూ ప్రక్షాళన మాయాజాలంలో ఈ భూమి ‘ధరణి’ పోర్టర్ లో పట్టా భూమిగా నమోదు చేశారు. ఇలా సవాలక్ష పొరపాట్లుకు పాల్పడిన సిబ్బందిపై చర్య తీసుకోవడం లేదా జరిగిన పొరపాట్లను సరిదిద్దడంలో ప్రభుత్వం విఫలమైంది. అంతేకాదు,  ప్రభుత్వ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన పొరపాట్లకు రైతులను బాధ్యులుగా చేసి రికార్డులు సవరించుకునేందుకు కోర్టుకు వెళ్లాలని సూచించడం సిగ్గుచేటుగా భావించాలి. ఇదిలా ఉండగా పలు సర్వే నంబర్లలో క్రయ, విక్రయాలు తరచుగా జరగడంతో సబ్ డివిజన్ ల సంఖ్య పెరిగింది. దీంతో ‘ధరణి’ పోర్టల్ లో భూములు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అవుతున్నప్పటికీ 15 సర్వే నంబర్లు దాంతో మ్యుటేషన్ ప్రక్రియ నిలిచిపోతున్నది.

ఫలితంగా కొనుగోలుదారులకు భూమి కొనుగోలు చేశామనే సంతృప్తి మిగలకపోగా, డబ్బు పోయినా భూమి హక్కులు రాలేదని అందోళన చెందుతున్నారు. వర్గల్ మండలం తున్కి ఖల్సా శివారులో ఇటీవల నగరానికి చెందిన ఒక రైతు సుమారు 20 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. సుమారు 50 సర్వే నంబర్ సబ్ డివిజన్లు ఉండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన మూడు నెలల వరకు మ్యుటేషన్ (పట్టామార్పిడి) జరుగలేదు. సీసీఎల్ఏ స్పాన్ సరిపోనందుకే మ్యుటేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా 2014లో తెలంగాణ ఆవిర్భావం నుండి భూమి రెవెన్యూ కమిషనర్ పోస్టులో ఇన్ చార్జి చీఫ్ సెక్రటరీలో కొనసాగడం గమనార్హం. ప్రధాన భూమి శిస్తు కమిషనర్ (సీసీఎల్ఎ) పోస్టులో రెగ్యులర్ సీనియర్ అధికారిని నియమించి, ధరణి పోర్టలో జరిగిన పొరపాట్లను సవరించవలసిన భాద్యత ప్రభుత్వంపై ఉన్నది.