భగ్గుమన్న రైతులు.. ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన..

భగ్గుమన్న రైతులు.. ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన..
  • కాంటాలైన కదలని లారీలు..
  • కళ్లాల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం..
  • గణపురంలో ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో..
  • సంఘీభావం తెలిపిన కాంగ్రెస్, బీజేపీలు..
  • కోతలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్.. 

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు భగ్గుమన్నారు. రోడ్డెక్కి వరి ధాన్యానికి నిప్పు పెట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం ఇన్ని సమస్యలు ఎదురు కావడంతో రైతులు కన్నెర్ర చేశారు. కళ్ల ముందే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసి పోవడంతో అది చూసిన రైతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అధికారుల తీరుపై మండిపడుతూ ఒక్కసారిగా భగ్గుమన్నారు. గణపురం, ములుగు ప్రధాన రహదారిపై ధాన్యం బస్తా లతో బాధిత రైతులందరూ మంగళవారం నిరసనకు దిగారు. తమ ఆవేదనను తట్టుకోలేక కొంతమంది రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతుల నిరసనకు టిపిసిసి సభ్యుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి చందుపట్ల కీర్తిరెడ్డిలు హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. 

ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన సివిల్ సప్లై అధికారులు, పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, రైతులు ధర్నాను కొనసాగించారు. 

- అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కోతలు లేకుండా కొనుగోలు చేయాలి..

అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కోతలు లేకుండా కొనుగోలు చేయాలి టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి చందుపట్ల కీర్తిరెడ్డి లు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో రైతుల పరిస్థితి తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. రైతుల ఆవేదనను అడిగి తెలుసుకుని వారి నిరసనకు సంఘీభావం తెలిపారు. రైతులు నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై రైతులను దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో తడిసిన వరి ధాన్యాన్ని మొత్తం ఒక గింజా తరుగు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి భూపాలపల్లి నియోజకవర్గం లోని అన్ని పీఎసీఎస్ సెంటర్లలో ఉన్న వరి ధాన్యం మొత్తం కూడా తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.  పీఎసీఎస్ సెంటర్లలో నిలువ ఉన్న ధాన్యాన్ని తూకం వేసేటప్పుడు అదనంగా 2 నుండి 10 కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారని, తూకం వేసిన వెంటనే రైతులకు రశీదులు ఇవ్వడం లేదని అన్నారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, తరలించాలని డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.