మాతా శిశు ఆసుపత్రి మెట్ల వరకు వరద నీరు

మాతా శిశు ఆసుపత్రి మెట్ల వరకు వరద నీరు
  • గోదావరి పోటెత్తుతే మళ్లీ మునగడం ఖాయం
  • ఎన్ టీఆర్ కాలనీ, డూప్లెక్స్ కాలనీలోకి కూడా బిక్కుబిక్కుమంటున్న జనం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వానలు అతలాకులం చేస్తోంది. గోదావరి, వాగులు ఉప్పొంగుతున్నాయి. మంచిర్యాల లో వర్షం దడ పుట్టిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తడం తో వరద ముంపుదాపురించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు చేరుకోవడంతో 32 గేట్లు ఎత్తివేయడంతో గోదావరిలో గంటగంటకు వరద నీరు పెరుగుతోంది. శుక్రవారం గోదావరి తీరాన వెలసిన గౌతమేశ్వర ఆలయం ,ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రి భవనం వరకు గోదావరి బ్యాక్ వాటర్ చేరుకుంది. గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగితే ఆసుపత్రిలోకి ఈఏడాది కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ముందు చూపుతో ఆసుపత్రిలోని రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే  గురువారం రాత్రి ఎన్ టీఆర్ నగర్ , ఎల్.ఐ. సీ.కాలనీలోని డూప్లెక్స్ హౌస్, పెద్దమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో ని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఇంటి నుంచి బయటకు రాలేని, పోలేని పరిస్థితి నెలకొంది. ఇండ్లలోకి నీరు చేరుకోవడంతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఎల్.ఐ. సీ.కాలనీ నుంచి ఎన్ టీఆర్ కాలనీకి వెళ్లే రహదారి వరద నీరుతో నిండుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద, రాళ్ళవాగు ప్రవహంతో ముందు జాగ్రత్త చర్యగా గురువారం రాత్రి రాళ్ళవాగు సమీపంలోని నివాసితులను పునరావాస కేంద్రంకు తరలించారు. గత ఏడాది వరద ముంపుకు గురైన బాధితులు మళ్లీ ఎక్కడ ముంపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్షాలను , పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పర్యవేక్షకురాలిగా జిల్లాకు నియమితులైన ఐ ఏఎస్ అధికారి భారతి హోళికేరి, కలెక్టర్ సంతోష్ గురువారం రాత్రి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీరు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే నిలతీత

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావును వరద ముంపు బాధితులు నిలతీశారు. ప్రతి ఏటా మాకు ఏమిటి తిప్పలు అంటూ ప్రశ్నించారు. ముంపుకు గురైన తమకు పునరావాసం ఎందుకు కల్పించలేదని నిగ్గతీశారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి ఎల్ ఐ సీ కాలనీలో నీట మునిగిన ఇండ్లను వీక్షించేందుకు వెళ్లగా చేదు అనుభవం కావడంతో వెనుతిరిగారు.