కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిథుల పంచాయతీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిథుల పంచాయతీ
ministry of finance

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ నిధుల విషయంలో పరస్పరం ఎంత దుమ్మెత్తి పోసుకున్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వాస్తవమేమిటంటే.. గ్రామ పంచాయతీలకు నిధులు అందడం లేదన్నది మాత్రమే. గ్రామాల అభివృద్ధికి కానీ, గ్రామాలలో సంక్షేమ పథకాలకు కానీ పైసా  నిధులు కూడా లేవు.అమలు జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలకు నిధులు అందక సర్పంచ్‌ లు అడకత్తెరలో పోక చెక్క మాదిరి నలిగిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గ్రామాల అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని సొంత భుజాలు చరుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగని విధంగా తెలంగాణలో గ్రామాభ్యుదయం వికసించిందని చెప్పుకుంటున్నారు.  అయితే గ్రామ పంచాయతీలకు నిధుల మంజూరు విషయంలో మాత్రం కేంద్రంపై నెపం తోసేసి చేతలు దులిపేసుకుంటోది. అదే సమయంలో  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందారోపణలో పబ్బం గడిపేసుకుంటూ.. గ్రామాలకు నిధుల మంజూరు విషయాన్ని విస్మరిస్తున్నాయి.  రాష్ట్రంలో గ్రామాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా అభివృద్ధి చెందు తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు గొప్పగా చెప్పుకుంటున్నా వాస్తవంలో మాత్రం నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు నానా అవస్థలూ పడుతున్నాయి.  నిధుల కొరత కారణంగా తాము నానా అవస్థలూ పడుతున్నామంటూ గత కొన్ని నెలలుగా  సర్పంచులు ఫిర్యాదుల విూద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాము కూడా చివరికి వ్యవసాయ కార్మికులుగా, కాపలా దార్లుగా పని చేయాల్సి వస్తోందని, ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కాంట్రాక్టర్లకు చెల్లించడానికి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని  చెబుతున్నారు. తమ దగ్గర నిధులు లేకపోయినా, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో తమపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోందని  వారు వాపోతున్నారు. చాలా నెలలుగా తమకు నిధులు విడుదల కావడం లేదంటూ   గగ్గోలు పెడుతున్నారు.ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదు. ఏ సర్పంచ్‌ ఏ పార్టీకి చెందినవారైనా నిధుల కొరత మాత్రం అందరికీ సమానంగానే ఉంటోంది. అత్యధిక శాతం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు బాకీ పడిరదని వారు చెబుతున్నారు.  

గ్రామ పంచాయతీలు నిధులు కేటాయించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై  విమర్శలు, అలాగే కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆరోపణలు, నిరసనలతో బీజేపీ హోరెత్తిస్తుంటే.. కాంగ్రెస్‌ కూడా పంచాయతీలకు నిధుల విషయంలో కేసీఆర్‌ సర్కార్‌ నే నిందిస్తోంది.  అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సరిగా నిధులు రావడం లేదని, కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, నిధుల్లో కోత విధించడం, నిధుల మంజూరులో ఆలస్యం చేయడం, విధులు ఆపేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పరస్పరారోపణల మధ్య అసలు వాస్తవం మరుగున పడిపోతోంది.  వాస్తవం ఏమిటంటే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయడం రాష్ట్రాల హక్కులను హరించడమేనని కేసీఆర్‌ అంటున్నారు.నిజమే.. కానీ కేంద్రం విడుదల చేశాం కానీ, రాష్టం దారి మళ్లించిందంటోది.  రాష్టరమేమో కేంద్రం నుంచి నిధులే రాలేదంటోంది. ఇప్పటికైనా పరస్పర నిందారోపణలను పక్కన పెట్టి వాస్తవమేమిటన్నది వెల్లడిరచి పంచాయతీలకు నిధుల కొరత పరిష్కరించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. పంచాయతీలకు సొంతంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. అందులోనూ మైనర్‌ పంచాయతీలకు నామమాత్రం. పంచాయతీ పరిధిలో చెరువులు, ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం కూడా అత్యధిక పంచాయతీలకు స్వల్పంగా ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాల తరపున విడుదల చేసే నిధులే పంచాయతీలకు ప్రధాన వనరులుగా మారాయి. అయితే కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా స్థానిక సంస్థలకు విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయంలో కూడా ఇలాంటి ప్రక్రియ కొంత వరకు సాగింది. మూడేళ్లుగా ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే దారి మళ్లిస్తుందనే ఆరోపణలు పంచాయతీ ప్రతినిధుల నుంచి వస్తున్నాయి. ఇలాంటి సమస్య అనేక రాష్ట్రాల్లో పంచాయతీలు ఎదుర్కొంటున్నాయి. తెలంగాణాలో కూడా సర్పంచులు తమ నిధుల విషయమై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విూద ఆందోళనలు నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా నిధులు ఇతర ఖాతాలకు మళ్లించకుండా నేరుగా పంచాయతీలకు వాటిని అందించేందుకు అనుగుణంగా ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ట్రెజరీల ద్వారా నిధులు అందించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్న తరుణంలో సొంతంగా పంచాయతీలకు ఖాతాలు తెరిచి వాటిలో జమచేయాలని కేంద్రం నిర్ణయించింది.