దళితుల సంక్షేమంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి - కేసీఆర్ కు లేఖ విడుదల చేసిన భట్టి

దళితుల సంక్షేమంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి - కేసీఆర్ కు లేఖ విడుదల చేసిన భట్టి

ముద్ర, ప్రతినిధి,  మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఏ మేరకు  సంక్షేమ పథకాలుప్రవేశపెట్టి అమలు చేస్తుందో శ్వేత పత్రం ద్వారా ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్ కు  బహిరంగ లేఖ రాశారు.  గురువారం శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్ రావు ఠాక్రే తో కలిసి ముఖ్యమంత్రికి రాసిన లేఖను భట్టి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు,  ఎన్ని నిధులు కేటాయించారు,  మంత్రివర్గంలో ఎంతమందికి స్థానం కల్పించారు, ఎంపీ, రాజ్యసభ ,ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు...కార్పొరేషన్లలో ఎంతమంది దళితులకు స్థానం కల్పించారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించడాన్ని ఆయన తప్పు పట్టారు. దళితుల సంక్షేమానికి పాటుపడకుండా నిధులను ఇతర పథకాలకు మళ్లించడం వల్ల దళితులకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. దళిత బంధు ప్రవేశపెట్టి కొంతమందికే వాటిని వర్తింపజేశారనే విమర్శలు ఉన్నాయని అన్నారు.  బడ్జెట్లో దళిత బందుకు 17,700 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఎన్ని నిధులు ఖర్చు చేశారని ఆయన లేఖలో ప్రశ్నించారు.   కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల విలువైన భూములను అప్పగిస్తున్న ప్రభుత్వం నిరుపేద దళిత, గిరిజనులకు జీవనం కోసం  ఇవ్వడానికి భూమి లేదనడం వివక్షతకు  నిదర్శనంగా భావిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళిత, గిరిజలకు కేటాయించిన అసైన్డ్ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. స్వాధీనం చేసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుందని విమర్శించారు. దళితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం అభిమానం, ప్రేమ లేదని అన్నారు.  ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రులు ట్యాన్క్ బండ్ పై ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి నివాళులర్పించడం వస్తోందని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నివాళులు అర్పించలేదని ఆరోపించారు.  హైదరాబాదులో 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్నీ స్వాగతిస్తున్నామని అయితే విగ్రహం ఏర్పాటు లో జాప్యంను తప్పుపడుతున్నామన్నారు.   కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు ప్రభుత్వం విగ్రహం ఆవిష్కరిస్తోందని భట్టి చెప్పారు. సమావేశంలో ఏ ఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు.