వైభవంగా శ్రీవారి రథోత్సవం

వైభవంగా శ్రీవారి రథోత్సవం
  • భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు
  • గోవింద నామస్మరణతో మారుమోగిన మాడవీధులు

ముద్ర, తెలంగాణ బ్యూరో :  తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో  భాగంగా సోమవారం ఉదయం 6.55 నుంచి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.  బ్రహ్మోత్సవాలలో ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.  కార్యక్రమంలో తిరుమ‌ల పెద్దజీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి దంప‌తులు, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి దంప‌తులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పలువురు బోర్డు స‌భ్యులు, జేఈవోలు  స‌దా భార్గవి, వీర‌బ్రహ్మం, సీవీఎస్ఓ న‌ర‌సింహ కిశోర్‌, అధికారులు పాల్గొన్నారు.