రైతు సంబరాల్లో గుమ్మడం సర్పంచ్ కు ఘోర అవమానం

రైతు సంబరాల్లో గుమ్మడం సర్పంచ్ కు ఘోర అవమానం

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పటై 10 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గుమ్మడం రైతు వేదికలో జరిగిన రైతు సంబరాల్లో ఘోర అవమానం జరిగిందంటూ గుమ్మడం సర్పంచు సువర్ణ ఆదివారం తెలిపారు. గుమ్మడం, తిప్పాయిపల్లి గ్రామల సర్పంచులు ఇద్దరు మహిళలు. శనివారం గుమ్మడం రైతు వేదికలో జరిగిన సమావేశానికి తిప్పాయిపల్లి సర్పంచు రమాదేవి హాజరు కాకపోవడంతో ఆమె భర్త మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

వేదికపై కూర్చున్న గుమ్మడం సర్పంచు సువర్ణ ను కుర్చీ లో నుంచి పక్కకు జరిపి మహేశ్వర్ రెడ్డి దౌర్జన్యంగా వేదికపైకి రావడంతో అవమానం జరిగిందని సువర్ణ పేర్కొన్నారు. ఆ విషయాన్ని ఆమె సభా ముఖంగా తెలుపుతుండటంతో రైతు వేదిక కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మైకు లాక్కొని తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు.