జమిలి ఎన్నికలను కాదు..

జమిలి ఎన్నికలను కాదు..
  • జనాలను నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు
  • ధ్వజమెత్తిన మంత్రి హరీశ్ రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జనాల‌ను నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు.. జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదు అని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు  స్పష్టం చేశారు. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా..? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా? అనే విష‌యాన్ని ఆలోచించుకోవాల‌న్నారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంద‌ని మంత్రి తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే ఎట్లా ఉండాలంటే సతీష్ బాబు లాగా ఉండాలన్నారు. నిజాయితీగల శాసనసభ్యుడు అని ప్రశంసించారు.  తెలంగాణ ఉద్యమ కాలంలో  గులాబీ జెండాకు ఉత్తర తెలంగాణలో అడ్డా అంటే మాకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు.. కొన్ని వందలసార్లు ఉద్యమంలో అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప ఇల్లు  సతీష్ బాబుదన్నారు. అందువల్ల  హుస్నాబాద్‌లో కూడా మూడోసారి సతీష్ కుమార్‌ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

 
కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్ అని హ‌రీశ్‌రావు ధ్వజమెత్తారు.  50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 2000 పెన్షన్ ఇచ్చారా..? కల్యాణ లక్ష్మి ఇచ్చారా..? మిషన్ భగీరథ‌ మంచినీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నల వ‌ర్షం కురిపించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుత‌ద‌ని నిల‌దీశారు.   ఇక రాష్ట్రంలో బీజేపీ  బిచాణ ఎత్తేసిందన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఎలక్షన్లు అంటున్నదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు వోడితెల‌ సతీష్ కుమార్, జెడ్ పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.