రుణమాఫీ, నిరుద్యోగుల హామీలపై మాట మార్చిన సన్యాసి సీఎం రేవంత్

రుణమాఫీ, నిరుద్యోగుల హామీలపై మాట మార్చిన సన్యాసి సీఎం రేవంత్
  • ముఖ్యమంత్రి నోటికంపు మోరీలను మించిపోయింది
  • రేవంత్ ను  లిల్లీపుట్, సన్యాసి అని నేను అనగలను
  • భాష మాట్లాడటానికి మాకు విజ్ఞత అడ్డువస్తోంది
  • నా ఎత్తుగురుంచి కాదు రైతుల గురించి ఆలోచించు
  • రైతు కళ్ళలో ఆనందం కాదు కన్నీళ్ళు తెప్పించావ్
  • మరోసారి అధికారంలోకి వచ్చే సీన్ కాంగ్రెస్ కు లేదు
  • సీఎం కూర్చీ మర్యాదను కాలరాస్తోన్నాడు
  • సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీష్ రావు ఫైర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రుణమాఫీ, నిరుద్యోగుల హామీలపై మాట మార్చిన సన్యాసి సీఎం రేవంత్ రెడ్డి అని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని , రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి మోసం చేసింది రేవంత్ రెడ్డి  కాదా?  అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు హుందా మాట్లాడాలని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో సీఎం ఒకలాగా, వ్యవసాయ శాఖ మంత్రి మరోకలాగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వర్షాకాలం రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదని, అన్ని పంటలకు బోనస్ అని చెప్పి బోగస్ చేసిందవరని ఆయన ప్రశ్నించారు. ఆదివారం గాంధీభవన్ కొత్త పీసీసీ చీఫ్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ''అగస్టు 15 వరకు పంటరుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రగల్భాలు పలికిన సన్యాసి ఎక్కడు దాక్కున్నారని''  పరోక్షంగా హరీష్ రావును సీఎం రేవంత్ విమర్శించారు.

దీంతో సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీమంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. తాను ఎక్కడ దాక్కోలేదని, నీ గుండెల్లో దాక్కునా, నీ గుండెళ్ళో నిద్రపోతున్నా, నిన్ను విడిచిపెట్టేది లేదు, నీ వెంట పడుతా  అని హరీష్ రావు గర్జించారు. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో ప్రజలు బాధపడుతుంటే, సీఎం రేవంత్ చిల్లర అబద్ధాలు అడుతున్నారని దుయ్యబట్టారు. వరదలతో వచ్చిన బురదను కడుక్కోగలుగుతున్నాం,  కానీ ముఖ్యమంత్రి నోటి నుంచి వస్తున్న మురుగు బురదను మాత్రం కడగలేకపోతున్నామని అన్నారు. మోరీల కంపు కంటే ముఖ్యమంత్రి నోటి కంపు మించిపోయిందని ఆయన విమర్శించారు. కనీసం ముఖ్యమంత్రి కూర్చీలో  కూర్చున్నామనే సోయి రేవంత్ రెడ్డికి లేకుండా పోయిందన్నారు. ఆయన మర్యాదతో పాటు సీఎం కూర్చీ మర్యాదను కూడా కాలరాస్తున్నాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాషలో సమాధానం ఇవ్వడం తమకు నిమిషం పని అని, కానీ ఆ భాషను మాట్లాడటానికి తనకు విజ్ఞత అడ్డువస్తుందని హరీష్ రావు అన్నారు. తాను తాటి చెట్టంత ఎదిగినా, నువ్వు మాత్రం వెంపలి చెట్టంత కూడా ఎదగలేదని రేవంత్ రెడ్డి మీద ఆయన మండిపడ్డారు.  రేవంత్ రెడ్డి తాను కూడా లిల్లీపుట్ , సన్యాసి అని సంభోదించగలనని అన్నారు.

ఇప్పటి వరకు తన ఎత్తు గురించి రేవంత్ రెడ్డి 20 సార్లు ప్రస్తావించారని ఆయన మండిపడ్డారు. తన ఎత్తు గురించి ఆలోచించటడం మానేసి రైతుల గురించి ఆలోచించాలని రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు. రుణమాఫీ చేయలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సిగ్గులేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి దుర్మార్గ నిబంధల వలన సురేందర్ రెడ్డి అనే రైతు ప్రాణాలు తీసుకున్నారని అన్నారు. రుణమాఫీ పూర్తి చేశా అని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టీనావు కదా, రుణమాఫీ అయిందని నిరూపిస్తావా? ఎక్కడికి పోదాం? నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాకి పోదాం? లేదా మా సిద్దిపేట వెంకటాపురం పోదాం? అని హరీష్ రావు సవాల్ విసిరారు. వెంకటాపురం గ్రామంలో 112 మంది రైతులకుగానూ, ఇంకా 82 మందికి రుణమాఫీ కాలేదన్నారు. రాష్ట్రంలో కోటి 13 లక్షల 74 వేల రైతులకు గానూ ఇంకా కోటీ 5 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. మొత్తం రూ. 31 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సివుండగా, కేవలం రూ. 17 వేల కోట్ల మాత్రమే చేశారని, కనీసం సగం కూడా చేయలేదని హరీష్ రావు మండిపడ్డారు. రుణామాఫీ, పింఛన్ రూ.4000 వేలు ఇస్తామని, మహిళలకు రూ.2500 ఇస్తామని, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటతప్పిన సన్యాసి సిఎం రేవంత్ రెడ్డి అని తాను 100సార్లు అనగలనని హరీష్ అన్నారు. అయితే తనకు విలువలు, సంస్కారం ఉందని, రేవంత్ రెడ్డిలా నోరు పారేసుకోలేని అన్నారు. రుణమాఫీ చేసిన వారి వివరాలను తనకు సీఎం పంపనవసరం లేదని, తనవద్దనున్న సమాచారాన్ని తానే పంపిస్తానని హరీష్ రావు చెప్పారు.

రైతు భరోసా, బోగస్ గ్యారంటీలతో రైతుల కళ్ళలో ఆనందం కాదని, కన్నీళ్ళు తెప్పించిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదేనని ఆయన దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసి ఫార్మా సిటీ ఏర్పాటు కోసం  రూ. 1500 కోట్ల ఖర్చుపెట్టి 12 వేల ఎకరాల భూమిని సేకరించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ ఫార్మాసిటీ భూమిలో రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆయన మండిప్డడారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి అంతసీన్ లేదని, రాజస్థాన్, చతీస్ ఘడ్ లో కాంగ్రెస్ గెలిపిస్తే 5 ఏళ్ల లోపు ప్రభుత్వాలు పోయాయని అన్నారు. నీ అదృష్టం బాగుంటే ఐదేళ్లు ఉంటావని, మంచిగా ప్రవర్తించు అని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు.