రాష్ట్రంలో కుండపోత

రాష్ట్రంలో కుండపోత
  • 7 జిల్లాలకు రెడ్, 17 జిల్లాలకు ఆరెంజ్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • జయశంకర్ భూపాలపల్లిలో పిడుగు పడి ముగ్గురు మృతి
  • నగరంలో నాలాలో పడి బాలుడు.. కరెంటు షాక్ తో మహిళ..
  • గుండ్ల పోచంపల్లి మైసమ్మగూడలో 4 ఇంజనీరింగ్ కాలేజీలు నీట మునక
  • మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
  • నేడు కూడా విద్యా సంస్థలకు సెలవు


ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో ఉత్తర వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, హన్మకొండలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే, ఆదిలాబాద్, కుమురంభీం, జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

నగరం అల్లకల్లోలం..

హైదరాబాద్‌లో కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా  వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. కాలనీలు నీటముగిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందగా.. హైదరాబాద్‌లోని ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేండ్ల బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. దాదాపు రెండు గంటలుఅధికారులు బాలుడి కోసం గాలించగా.. రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహాం లభ్యం అయ్యింది. మృతి చెందిన బాలుడు మిథున్ రెడ్డి(4)గా గుర్తించారు. అలాగే బాలానగరంలో ఇంట్లోకి వచ్చిన వర్షపు నీటిని బయటకు తోడేస్తూ కరెంటు షాక్ తగిలి ఓ మహిళ చనిపోయింది. మేడ్చల్ జిల్లాలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో భారీ వర్షం కురుస్తోంది. మైసమ్మగూడ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉంటున్న ప్రైవేటు హాస్టల్స్‌ మొదటి అంతస్తులోకి వరద నీరు వచ్చి చేరింది. సుమారు 15 అపార్ట్‌మెంట్లలోకి వరదనీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది. 

చెరువులను తలపించిన రహదారులు 

నగరంలో ఖైరతాబాద్‌, పంజాగుట్ట, నాంపల్లి, బేగంపేట, అమీర్‌ పేట, సికింద్రాబాద్‌, జీడిమెట్ల, సూరారం, బాలానగర్‌, కూకట్‌ పల్లి, ఎల్బీనగర్‌, మలక్‌ పేటలో భారీ వర్షం కురిసింది. బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్, బాలాజీ నగర్, ప్యాట్నీ ప్యారడైజ్, బేగంపేట్ ప్రాంతాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వనస్థలిపురం, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, గుండ్ల పోచంపల్లితో పాటు అనేక ప్రాంతాలు నీటమయమయ్యాయి. వరద నీటితో రహదారులన్నీ జలమయం కాగా.. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొగా.. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స‌హాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్ 040-21111111, డయల్ 100, 9000113667కు కాల్ చేయాలని సూచించారు. భారీ వానలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. 

మైసమ్మగూడ ప్రాంతంలో.. 

మేడ్చల్‌లోని గుండ్ల పోచంపల్లి మైసమ్మగూడ ప్రాంతంలో కాలువలు, నాలాలు కబ్జాకు గురయ్యాయి. భారీ వానలకు ఈ ప్రాంతంలోని 4 ఇంజనీరింగ్ కళాశాలలు నీట మునిగాయి. స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి ట్రాక్టర్లు, జేసీబీలను పంపించి విద్యార్థులను ముంపు ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చారు. వార్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రారంభమయ్యింది. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీరు వదిలారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు మానేరు, ఇతర స్థానిక వాగులనుంచి ప్రవాహం వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరిలో 36.81 మీటర్ల మట్టం నమోదవ్వగా, నదిలో 78,663 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.