సామాన్యుడికి కూర‘గాయాలు’

సామాన్యుడికి కూర‘గాయాలు’
  • ఎరుపెక్కించిన టమాట..
  • ఘాటెక్కిస్తున్న మిర్చి
  • దేశవ్యాప్తంగా భారీగా ధరల పెరుగుదల
  • భారీ వర్షాలతో రైతన్నలకు నష్టాలు
  • లాభపడుతున్న దళారులు
  • అంతంతమాత్రంగానే ప్రభుత్వం చర్యలు


న్యూఢిల్లీ: టమాటాలు ఎరుపెక్కాయి, పచ్చిమిర్చి ఘాటెక్కింది.. మిగతా కూరగాయలు కొందామంటే కూడా ధరలతో సామాన్యున్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఇటు దక్షిణాది రాష్ర్టాల్లోనే కాకుండా అటు ఉత్తరాది రాష్ర్టాల్లో కూడా భారీ ధరలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యుడు కూరగాయలను కొనాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. కూలీ, నాలీ చేసుకొని కాలం వెళ్లదీసేవారి పరిస్థితైతే చెప్పనక్కరలేదు. ఏం కొనలేక, ఏం తినలేక అన్నట్లుగా తయారైందని వాపోతున్నారు. బిహార్​, ఉత్తరాఖండ్​, జమ్మూకశ్మీర్​, ఢిల్లీ, యూపీ, అస్సాం, మణిపూర్​, బెంగాల్, రాజస్థాన్​, గుజరాత్​, ఎంపీల్లోనూ కాకుండా ఇటు దక్షిణాదిన ఎపి, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో కూడా వర్షాల వల్ల పంట దిగుబడులను రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో మార్కెట్లలో ధరలు పెరిగాయి. 

టమాట ఉత్తరాదిన హయ్యస్ట్​గా రూ. 250 ధర పలకడం విశేషం. మరోవైపు పచ్చిమిర్చి కూడా అదే స్థాయిలో ఘాటెక్కించడం, పోనీ ఆకు కూరలైనా తిందామనుకుంటే వర్షాల వల్ల అవి నేలపాలు కావడంతో ఓ వైపు రైతుకు నష్టం వాటిల్లడమే గాక ఇటు సామాన్యుడు కూడా వాటిని కొనలేని స్థితిలో ధరలున్నాయి. ఇంకోవైపు ఆయా రాష్ర్టాల్లో పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడడం, రహదారులు మూసుకుపోవడం కూడా కూరగాయల ధరల పెరుగుదలకు కారణమవుతోంది. రైతులు కాస్తో, కూస్తో పండించిన పంటలను మార్కెట్లకు తీసుకువద్దామనుకుంటే వారికి దళారులు, వాహన ఖర్చుల బెడద తప్పడం లేదు. దీంతో రైతులు స్థానిక మార్కెట్లలోనే కూరగాయలను ఎంతకో అంతకు అమ్మేసుకుంటున్నారు. దీంతో నగరాలకు రావాల్సిన కూరగాయలు కాస్త సరిపడా రావడం లేదు. మరోవైపు మార్కెట్లకు తీసుకువస్తున్న రైతన్నలకు మాత్రం ధరలను దళారులు ఆశించిన మేరకు అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఓ వైపు ఆరుగాలం కష్టించిన రైతన్నకు తిప్పలూ తప్పక, ఇటు సామాన్యులకు కూరగాయల ధరలు అందుబాటులో లేక మరోవైపు నడిమధ్యలో ఉన్న దళారీలు జేబులు నింపుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో కూరగాయల ధరలు ఉండేలా దేశంలోని వివిధ పెద్ద పెద్ద మార్కెట్లలో వాటిని సరసమైన ధరలకే అందజేస్తున్నప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఓ వైపు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించినా చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే తీసుకోవడంతో కూరగాయల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని జనాలు వాపోతున్నారు. సామాన్యునికే కాక మధ్యతరగతి ప్రజలకు కూడా కూరగాయలు కాస్త ‘గాయాల’పాల్జేస్తున్నాయని వాపోతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ఆయా రాష్ర్టాల్లో వాగులు వంకలు పొంగిపోర్లు పంట పొలాలను ముంచెత్తాయి. దీంతో రైతు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇది కూడా కూరగాయల ధరలు పెరిగిందేకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. 

  • ఢిల్లీలో కూరగాయల ధరలు ఇలా
టమాటా 152/-
పచ్చిమిర్చి 100/-
బీట్​రూట్​  90/-
కాలిఫ్లవర్​  20/-
బీన్స్​  80/-
క్యాబేజీ  40/-
వంకాయ  40/-
బెండకాయలు  80/-