బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి పై కర్రలతో దాడికి యత్నం - పరిస్థితి ఉద్రిక్తం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి  ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిర్మల్ లోని వై ఎస్ ఆర్ కాలనీలో ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రచారం చివరి రోజైన మంగళవారం ఆయన ప్రచారం చేస్తున్న క్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్, బీ ఆర్ ఎస్ కు చెందిన సాజిద్ ఖాన్ అనుచరులు పోటీగా ప్రచారం ప్రారంభించారు. అదే సమయంలో ఆయన వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడికి యత్నించారు. దీంతో మహేశ్వర్ రెడ్డి అనుచరులు ఆయనకు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.  వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన డీ ఎస్పీ గంగారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.