ఆదాయం ఫుల్.. అభివృద్ధి నిల్

ఆదాయం ఫుల్.. అభివృద్ధి నిల్

రహదారిపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు

“ప్రస్తుతం పట్టణంలో అభివృద్ధి చెందుతున్న గద్దె రాగడి ప్రాంతానికి ప్రత్యేక పేరు ఉంది.రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పెరగడంతో భూములు మంచి ధరలు పలుకుతున్నాయి. వీటన్నింటితో పాటు చేపట్టే నూతన ఇండ్ల నిర్మాణాలతో ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ పెరిగింది. నిర్మాణాల పర్మిషన్ కొరకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి లక్షల రూపాయలను చెల్లిస్తున్నారు. తద్వారా ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు మాత్రం శూన్యంగానే మీగిలాయి.ఇటీవల కురుస్తున్న వర్షాలకు అమ్మ గార్డెన్, మంజునాథ హిల్స్ ప్రాంతంలోని రహదారులపై వర్షపు నీరు,బురద పేరుకొని అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 'ముద్ర'లో ప్రత్యేక కథనం”


రామకృష్ణాపూర్,ముద్ర : గద్దె రాగడి ప్రాంతం నుంచి క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి లక్షల రూపాయలలో ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదని ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రజా ప్రతినిధులను,అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏళ్ళు గడుస్తున్న గెలిచిన ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంత ప్రజా సమస్యలు పరిష్కరించడంలో  విఫలమయ్యారనే ఆరోపణలు ప్రజల్లో నుంచి వినిపిస్తున్నాయి. ఆదాయం ఫుల్.. అభివృద్ధి నిల్ ఆన్న చందంగా అమ్మ గార్డెన్, మంజునాథ హిల్స్ కాలనీలోని రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షాకాలం వచ్చిన ఇప్పటి వరకు ఏ ఒక్క అభివృద్ధి పనులను ప్రారంభించలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


-అస్తవ్యస్తంగా రహదారులు

::మాజీ వార్డ్ మెంబర్ గొపతి బానేష్

మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ సమీపంలోని అమ్మ గార్డెన్, మంజునాథ హిల్స్ కాలనీలకు సంబంధించిన రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యారయని మాజీ వార్డ్ మెంబర్ గొపతి బానేష్ ఆరోపించారు. ఆ ప్రాంతాలలో చేపట్టే ఇండ్ల నిర్మాణాలతో మున్సిపాలిటీకు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనులను మాత్రం చేపట్టడం లేదన్నారు. వర్షాకాలంలో వర్షపు నీరు,బురద నిండిన రహదారులతో ప్రజలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. ఉదయం పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. వెంటనే నిధులు మంజూరు చేసి సైడ్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు,రహదారి పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి ప్రాంత ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.


త్వరలో పనులు ప్రారంభిస్తాం..

:: మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ

డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ట్రస్టు ఫండ్‌ (డీఎంఎఫ్‌టీ) నిధుల ద్వారా  మున్సిపాలిటీలోని 22 వార్డులలో సుమారు 15 కోట్ల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ పేర్కొన్నారు. శ్రీనివాస గార్డెన్ నుంచి ఏం.ఎన్.ఆర్ గార్డెన్ వరకు 22 కోట్ల రూపాయలతో రోడ్ వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులు  చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏ వార్డుకు ఎంత నిధులు కేటాయించారనేది జిల్లా కలెక్టర్ నుంచి వచ్చే డీఎంఎఫ్‌టీ ఆర్డర్ కాపి పై ఆధారపడి ఉందన్నారు.వచ్చిన ఆర్డర్ కాపిని మీడియాకు విడుదల చేస్తామన్నారు.