ఆసియాకప్​–2023

ఆసియాకప్​–2023
  • ఫిట్​నెస్​లో రాహుల్​ఫెయిల్​
  • రెండు మ్యాచ్​లకు దూరం

ముంబై: ఆసియాకప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సమస్యలతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో గత నాలుగు నెలలుగా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లోనే గడుపుతున్న కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నప్పటికి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దాంతోనే పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలియజేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. 'కేఎల్ రాహుల్ అద్భుతంగా కోలుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు భారత్‌ ఆడబోయే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 'అని తెలిపాడు. ఆసియాకప్ కోసం ఎన్‌సీఏలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్ మంగళవారం ముగియగా.. భారత ఆటగాళ్లు శ్రీలంకకు పయనమయ్యారు. రాహుల్ మాత్రం ఎన్‌సీఏలోనే ఉండనున్నాడు. సెప్టెంబర్ 4న అతని ఫిట్‌నెస్ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. యోయో టెస్ట్ అధిగమించడంతో పాటు ఎన్‌సీఏలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 199 పరుగులతో సత్తా చాటాడు. నెంబర్4లో అతనే బరిలోకి దిగనున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరమవడంతో జట్టులోకి రిజర్వ్ ప్లేయర్ అయిన సంజూ శాంసన్ వచ్చాడు. ఇషాన్ కిషన్‌కు అతను బ్యాకప్‌గా ఉండనున్నాడు. కేఎల్ రాహుల్ గైర్హాజరీతో టీమిండియా కాంబినేషన్ మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించాలంటే శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే మిడిలార్డర్‌లో ఆడించాల్సిందే. శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా కొనసాగించాలనుకుంటే సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్‌గా ఆడించనున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ రావాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్