మౌలిక అభివృద్దే భారత్​కు మూలస్థంభం

మౌలిక అభివృద్దే భారత్​కు మూలస్థంభం
  • రాబోయే కాలంలో రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడులు
  • వంద ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు కేటాయింపు
  • 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్​
  • గతిశక్తి జాతీయ మాస్టర్​ ప్లాన్​ వెబినార్​లో ప్రధాని మోడీ


న్యూఢిల్లీ: ఈ ఏడాది బడ్జెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కొత్త వృద్ధి శక్తిని ఇస్తుందని, భారతదేశం అభివృద్ధి చెందే ప్రక్రియలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎల్లప్పుడూ ముఖ్యమైన మూలస్తంభమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌తో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు - లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై బడ్జెట్ అనంతరం ఒక్కో అంశంపై మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం వెబ్‌నార్‌లో ప్రధాని మోడీ ప్రసంగించారు. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద, రాబోయే సంవత్సరాల్లో 110 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందన్నారు.  ప్రతి వాటాదారునికి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు అందజేస్తామని, సాహసోపేతమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం అని ప్రధాని పేర్కొన్నారు. 2014తో పోలిస్తే నేటి సగటు వార్షిక జాతీయ రహదారుల నిర్మాణం దాదాపు రెట్టింపయ్యిందన్నారు. దురదృష్టవశాత్తు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఆధునిక మౌలిక సదుపాయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు.


‘గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ గురించి మాట్లాడుతూ, ఇది భారతదేశ మౌలిక సదుపాయాలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌ను పునరుజ్జీవింపజేయబోతోందన్నారు. ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్రణాళిక,  అభివృద్ధిని ఏకీకృతం చేయడానికి ఇది గొప్ప సాధనమని మోడీ స్పష్టం చేశారు. గతి శక్తి మాస్టర్ ప్లాన్ ఫలితాలు కనిపిస్తున్నాయని, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంతరాలను ప్రభుత్వం గుర్తించిందని మోడీ పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో 100 కీలకమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చి 75 వేల కోట్ల రూపాయలను కేటాయించామన్నారు.


 2014కి ముందు సంవత్సరానికి కేవలం 600 రూట్ కి.మీ రైల్వే ట్రాక్ విద్యుదీకరించబడితే, నేడు అది కాస్తా 4000 కి.మీలకు చేరుకుందన్నారు. భవిష్యత్​లో మరింత రెట్టింపునకు కృషి చేస్తామన్నారు.  విమానాశ్రయాల సంఖ్య, ఓడరేవు సామర్థ్యం కూడా రెట్టింపు అయ్యాయని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదే మార్గాన్ని అనుసరించడం ద్వారా 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని సాధిస్తుందని మోడీ సూచించారు. 


 భారతదేశం భౌతిక మౌలిక సదుపాయాల పటిష్టత దేశం సామాజిక అవస్థాపనా పటిష్టతకు సమానంగా ముఖ్యమైనదని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. బలమైన సామాజిక మౌలిక సదుపాయాలు మరింత ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన యువత దేశానికి సేవ చేయడానికి ముందుకు వస్తాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.