కేసీఆర్.. కౌలు రైతులను ఆదుకోండి

కేసీఆర్.. కౌలు రైతులను ఆదుకోండి
  • రైతుల బాధలు అర్థం చేసుకునే ప్రభుత్వం మాదే!
  • బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ రాజేందర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్​రూపాయి సాయం కూడా చేయడంలేదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​విమర్శించారు. రైతుల బాధలు, దుఖాన్ని అర్థం చేసుకునే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. గురువారం ప్రధాన మంత్రి కృషి సంవృద్ధి కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా షాద్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోట్లమంది రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గురువారం రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. లక్షా 25 వేల కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ల తరువాత రైతుల బాధలు, దుఖాన్ని అర్థం చేసుకునే ప్రభుత్వం వచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా కోట్ల మంది రైతుల భూములకు భూసార పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కిసాన్ సమృద్ధి కేంద్రాలైన వన్ స్టాప్ సెంటర్ లో రైతులకు అవసరమైన అన్ని వస్తువులు దొరుకుతాయని తెలిపారు. ఇంకా లక్షా 75 వేల ప్రధాన మంత్రి కృషి సంమృద్ధి కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

  • రైతుల మీద భారం వేయలే..

కరోనా, ఉక్రెయిన్ యుద్ధంతో ఫెర్టిలైజర్ ధరలు భారీగా పెరిగినా కేంద్రం ఆ భారం రైతుల మీద పడనీయలేదన్నారు. యూరియా రూ.2,503 ఉంటే రైతులకు రూ.267 అందిస్తుందన్నారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీ రూ.2,236లని తెలిపారు. డీఏపీ రూ.  3711 ఉంటే రూ. 2422 సబ్సిడీ ఇచ్చి రూ.1300లకే ఇస్తున్నారని తెలిపారు. 11 కోట్ల మంది రైతులకు ప్రధాని సమ్మాన్ నిధి ఇచ్చి ఆదుకున్నట్లు తెలిపారు. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధర పెరిగినా మన దేశంలో పెరగకుండా రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 పైసలు ఇవ్వని కేసీఆర్​మన డబ్బులు తీసుకెళ్లి మహారాష్ట్రలో ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. భారత ప్రభుత్వం పంట నష్టం కోసం ఫసల్ బీమా యోజన స్కీమ్ తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టక పోవడంతో పంట నష్టం డబ్బులు రావడం లేదన్నారు. హెలికాప్టర్​లో వెళ్లి అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన వారికి రూ.10 వేల ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా మోసం చేశారని ఈటల విమర్శించారు.