జయహో.. జనయిత్రి.. 

జయహో.. జనయిత్రి.. 

‘మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు.. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు కదా’ అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరించక తప్పదు. నేటి సమాజంలో మహిళలు స్వశక్తితో, ఆత్మగౌరవంగా తమ జీవనాధార అవకాశాలను తామే సృష్టించుకుని, ఉన్నతస్థితికి చేరుకుని స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు.  విద్య, వైద్యం, ఫ్యాషన్​, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ... ఇలా రంగం ఏదైనా సరే.. ఉన్నత శిఖరాలను చేరుకుని తాము ఆకాశంలో సగం కాదని.. తామే ఆకాశం అని నిరూపిస్తోంది నేటి మహిళ.. అలాంటి కోవకు చెందిన మహిళలే దిశా అమృత్​, అవనీ చతుర్వేదిలు.. 

ఆకాశంలో అవని
ఆకాశంలో యుద్ధ విమాన విన్యాసాలను నేలపై నిల్చుని చూస్తుంటేనే భయమేస్తుంది, ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి సాహసోపేత విన్యాసాలు పురుషులే చేస్తుంటారు. కానీ, నేడు ఆ అవకాశం మహిళలకు కూడా వచ్చింది. మనదేశంలో నిర్వహించిన వైమానిక యుద్ధ విన్యాసాల్లో పరువురు మహిళలు కూడా పాల్గొని మహిళా శక్తిని చాటారు. అయితే విదేశాలలో జరగబోయే ఎయిర్​ షోలో పాల్గొంది యువ ఫైటర్​ పైలట్ అవనీ చతుర్వేది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న మొదటి మహిళ అవని. భారతదేశంలో జరిగిన వైమానిక యుద్ధ విన్యాసాలలో ఇప్పటికే పలువురు మహిళా యుద్ధ విమాన పైలట్లు పాల్గొన్నప్పటికీ, విదేశాలలో నిర్వహించే విన్యాసాలలో మహిళలు భాగమవడం మాత్రం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది అవనీ చతుర్వేది. భారత వాయుసేన(ఐఏఎఫ్​)కు చెందిన మహిళా ఫైటర్​ పైలట్, స్కాడ్రన్​ లీడర్​ అవనీ చతుర్వేది తొలిసారి దేశం వెలుపల గగనతల యుద్ధక్రీడ (ఏరియల్​ వార్​గేమ్స్)లలో పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘వీర్​ గార్డియన్​‌‌‌‌–2023’ పేరుతో  జపాన్​లోని హ్యకురి, ఇరుమా ఎయిర్​బేస్​పరిధిలో జరిగే ఈ క్రీడలలో పాల్గొన్న భారత బృందంలో అవని కూడా ఉంది.

అవని చతుర్వేది మధ్యప్రదేశ్​లోని సత్నా జిల్లాలో 1993, అక్టోబర్​ 27న జన్మించింది. తండ్రి దినకర్​ చతుర్వేది మధ్యప్రదేశ్​ రాష్ట్ర జల వనరుల శాఖలో సూపరింటెండింగ్​ ఇంజనీర్​గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి గృహిణి. అవని అన్న ఆర్మీ ఆఫీసర్​. ఆమె విద్యాబ్యాసమంతా షాడోల్​ జిల్లాలోని డియోల్యాండ్​ అనే చిన్న పట్టణంలో  పూర్తిచేసింది. 2014లో రాజస్థాన్​లోని బనస్థలి యూనివర్శిటీలో టెక్నాలజీ విభాగంలో బీటెక్​ పూర్తిచేసింది అవని. బీటెక్​ చదువుతున్నప్పుడే.. అదే కళాశాలలోని ఫ్లయింగ్​ క్లబ్​లో చేరింది. ఈ ఫ్లయింగ్​ క్లబ్​లో రోజూ కొన్ని గంటపాటు విమానాన్ని నడిపేది అవని. అప్పటికే ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తోన్న అవని అన్న, ఆమెను ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ లో చేరేలా ప్రేరేపించాడు. డిగ్రీ పూర్తిచేసిన తరువాత ఆమె ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించింది. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​లో చేరింది. హైదరాబాద్​లోని దుండిగల్​, హకీంపేట, బీదర్​ ఎయిర్​బేస్​లలో శిక్షణ పొందింది. 

 భారత వైమానిక దళం తొలిదశ యుద్ధ విమాన పైలట్లుగా నియమించిన ముగ్గురు మహిళా పైలట్లలో అవని అందరికంటే చిన్నది. ఆర్మీ ఆఫీసర్​ అయిన తన అన్నయ్య స్ఫూర్తితో వాయుసేనలో చేరాలనుకున్న అవని.. తన కలను సాకారం చేసుకోవడమే కాదు.. మిగ్​ 21 బైసన్​, సుఖోయ్​ వంటి అత్యంత క్లిష్టమైన యుద్ధ విమానాలను నడిపి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ‘వీర్​ గార్డియన్​ 2023’ విన్యాసాల్లో పాల్గొని తన పేరిట మరో చరిత్రను లిఖించింది అవని.  2016లో మహిళల్ని యుద్ధ విమాన పైలట్లుగా నియమించడం మొదలుపెట్టింది ఐఏఎఫ్​. తొలిదశలోనే అవనీచతుర్వేది, భావానాకాంత్​, మోహనాసింగ్​లు మొదటి మహిళా యుద్ధ విమాన పైలట్లుగా ఎంపికయ్యారు. కఠినమైన మూడు దశల శిక్షణను పట్టుదలతో పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు మహిళలు, భవిష్యత్తులో ఈ రంగంలోకి రావాలనుకున్న మహిళలకు బాటను వేశారు. వీరిలో అతి పిన్న వయస్కురాలైన అవని తరువాత వెనుదిరిగి చూడలేదు. ప్రపంచంలోనే అత్యధిక ల్యాండింగ్​, టేకాఫ్​ స్పీడ్​ గల యుద్ధ విమానాన్ని గుజరాత్​లోని జామ్​నగర్​ ఎయిర్​ బేస్​ నుంచి దాదాపు అరగంట పాటు నడిపింది. శత్రు సైన్యాలపైకి దూసుకువెళ్లే యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది ఈ ఫైటర్​ పైలట్. అంతేకాదు రష్యాకు చెందిన అత్యంత క్లిష్టమైన మిగ్​–21 బైసన్​ అనే యుద్ధవిమానాన్ని నడిపి మరో చరిత్రను తన పేరిట లిఖించుకుంది ఈ ధీర. ప్రస్తుతం సుఖోయ్​–30 ఎంకెఐ యుద్ధ విమానానికి పైలట్​గా కొనసాగుతోంది అవని. భారత్, జపాన్​ సంయుక్తంగా ‘వీర్​ గార్డియన్​ 2023 ఎక్సర్​సైజ్​’ పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య సైనిక సంబంధాల అభివృద్ధి దిశగా అక్కడి హ్యాకురి ఎయిర్​బేస్​లో జరుగుతోంది ఈ ఎయిర్​షో. భారత్​ తరపున పాల్గొన్న 150 మందితో కూడిన వైమానిక బృందంలో ఏకైక మహిళా యుద్ధ విమాన పైలట్​ అవనీ చతుర్వేది మాత్రమే.