అనంతలో జేసీ వర్సెస్‌ పెద్దారెడ్డి

అనంతలో జేసీ వర్సెస్‌ పెద్దారెడ్డి
jc vs pedda reddy

గడచిన కొన్ని రోజులుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ రాజకీయ వేడిని రగిలించారు. ఇప్పటికే 68 కేసులు పెట్టారు అంతకుమించి ఏం చేస్తారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి అంటున్నారు. అందుకు ప్రతిగా ఈయన కూడా అనుచరులతో డీఎస్పీ చైతన్యపై సుమారుగా 13 కేసులు, ప్రైవేట్‌ కేసులు వేయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం ఏమాత్రం తగ్గడం లేదు. ‘’ గతంలో విూ ఇంటికే వచ్చాను ... విూ బెడ్రూంలోకి రాలేనా ... నీవు చేసిన ఆరోపణలపై తాడిపత్రి సర్కిల్‌లో బహిరంగ చర్చకు సిద్ధమా’’ అంటూ సవాల్‌ విసురుతున్నారు. తాడిపత్రిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. స్థానిక డీఎస్పీ చైతన్య సహాయ సహకారాలతో ఎమ్మల్యే ఇసుక అమ్ముకుంటూ, గంజాయి, మట్కాలలో వాటాలు పంచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు.పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రతిపక్షాలపై కేసులు పెట్టి భయపెడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ‘‘అరేయ్‌ ... ఒరేయ్‌’’ అంటూ సంభోదిస్తూ అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారు. డీఎస్పీ చైతన్యను ఉద్దేశించి నాలుగు రోజుల క్రితం మాట్లాడుతూ ‘‘ వీడు పోలీసు జీతం తీసుకుంటున్నాడు కానీ పోలీసు కాదు.. మొన్న థర్డ్‌ జెండర్‌ అని అన్నాను వీడు అది కూడా కాదు.. దేనితో కంపేర్‌ చేయాలో తెలియడం లేదు..

ప్రపంచంలో ఏ జాతికి చెందనివాడు ఈ చైతన్య... ఎస్పీ, డీఐజీలు విచారణ నిర్వహించాలి’’.అని తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. ‘’అబ్బకు అమ్మకు పుట్టి ఉంటే తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్లో నేను కూర్చుంటా.. మూడు సంవత్సరాల్లో నేను ఏం చేశానో చెబుతాను.. 30 సంవత్సరాలలో విూ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారో చెప్పాలి. బహిరంగ చర్చకు రావాలి.’’ అంటూ సవాల్‌ విసిరారు.ఇలా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటూ మధ్యలో పోలీసు శాఖను మరీ ముఖ్యంగా డీఎస్పీని టార్గెట్‌ చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు మౌనం దాల్చడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.