ఇంకా ఉంది.. రెండోసారి ముగిసిన కవిత విచారణ

ఇంకా ఉంది.. రెండోసారి ముగిసిన కవిత విచారణ
  • పదిన్నర గంటల పాటు ప్రశ్నల పరంపర
  • సౌత్​ గ్రూప్​ ప్రమేయం ఏమిటని ఆరా
  • సిసోడియా, అరోరా, పిళ్లైతో కలిపి ఎంక్వైరీ 
  • సాయంత్రం ఒక్కసారిగా పోలీసుల హడావుడి
  • హుటాహుటిగా ఈడీ ఆఫీసుకు వచ్చిన లాయర్లు
  • రాత్రి 9‌–15కు బయటకు వచ్చిన కవిత
  • నేడు మళ్లీ రావాలన్న ఈడీ అధికారులు
  • ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికీ నోటీసులు 
  • ఇంకా మిస్టరీ వీడని ఢిల్లీ లిక్కర్ స్కామ్  
  • కేసులో  కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్​ స్కామ్ లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సౌత్​ గ్రూప్ నకు ప్రాతినిధ్యం వహించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆమెను ఏకంగా పదిన్నర గంటలకు పైగా విచారించారు. ముందుగా ఈ నెల 11న విచారణను ఎదుర్కొన్న కవిత తొమ్మిది గంటల పాటు ఈడీ అఫీసర్ల ఆధీనంలో ఉన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసిన కవిత ఈడీ విచారణ తీరును తప్పు పట్టారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 9.15 గంటలకు బయటకు వచ్చారు. మంగళవారం మళ్లీ రావాలంటూ నోటీసులు ఇచ్చి పంపించారు. 

విచారణలో ప్రధానంగా సౌత్​ గ్రూప్​ ప్రమేయంపై అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తున్నది. రూ.100 కోట్ల ముడుపులు, సౌత్​ గ్రూపులో ఎవరెవరు ఎంత షేర్​ ఇచ్చారు? ఎలా పంపించారు? వాటిని పంజాబ్​కు పంపించారా లేక ఢిల్లీలోనే అప్పగించారా? అనే కోణాలలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు టాక్. అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ముఖాముఖి విచారించినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా సౌత్‌ గ్రూప్‌తో లింకులకు సంబంధించి వివరాలను రాబట్టారు.  కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఆ తర్వాత అమిత్‌ అరోరా, మనీశ్‌ సిసోడియాతో కలిపి ప్రశ్నించారు, సాయంత్ర ఒకేసారి పిళ్లై, సిసోడియా, అమిత్​ అరోరా, కవితను విచారించారని టాక్​. 


ముద్ర, తెలంగాణ బ్యూరో : కవిత విచారణ ఇంకా ముగియలేదు. మంగళవారం కూడా విచారించనున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్​రెడ్డిని కూడా మంగళవారం  విచారించనున్నారు. సౌత్​ గ్రూప్​ లో వీరిద్దరు కీలకంగా ఉన్నారని ఈడీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కవితను మళ్లీ విచారణకు పిలిచినట్లుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొన్నది. పలువురు మంత్రులు, బీఆర్ఎస్​పార్టీ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. ఉదయం కవిత ఆమె భర్త అనిల్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. వారితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆమె తరపు న్యాయవాది సోమ భరత్ కూడా వచ్చారు. కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లగా, వారు బయటే ఉండిపోయారు. 11న ఆమెను ఈడీ అధికారులు తొలిసారి ప్రశ్నించారు. 16న  మళ్లీ రావాలని నోటీసులు జారీ చేసినా, ఆమెయ రాలేదు.  సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ 24కు రానుందని, ఇలాంటి సమయంలో విచారణకు రాలేనని చెప్పారు. కానీ,  సోమవారం రావాలని నోటీసులు ఇవ్వడంతోపాటు ఈడీ సుప్రీంకోర్టులో కేవియట్​ దాఖలు చేసింది. దీంతో కవిత రెండోసారి విచారణకు వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇటు ఈడీ ఆఫీస్​ ఎదుట, అటు తెలంగాణ భవన్​, తుగ్లక్​ రోడ్​లోని కేసీఆర్​ నివాసంతో పాటుగా రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొన్నది. పార్టీ వర్గాలు టీవీలకు అతుక్కుపోయారు. ఏం జరుగుతుందనే విషయాలపై ఢిల్లీ సమాచారం కోసం ఎదురుచూశారు.

డాక్టర్లు రావడంతో 
ఈడీ విచారణ నేపథ్యంలో సాయంత్రం అనూహ్యంగా ఇద్దరు డాక్టర్ల బృందం ఈడీ ఆఫీసులోకి వెళ్లడంతో మరింత టెన్షన్​ పెరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు వైద్య బృందం, న్యాయవాదుల బృందం ఈడీ కార్యాలయంలో ఉన్నారు. దీంతో కవితను అరెస్ట్​ చేస్తారనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో బీఆర్​ఎస్​ వర్గాలు సైతం నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. అప్పటికే సీఎం కేసీఆర్​ సందేశం కూడా పార్టీ వర్గాలకు చేరింది. దీంతో కవిత అరెస్ట్​ అవుతారనే ప్రచారం మొదలైంది.

9.15 గంటలకు కవిత బయటకు
రాత్రి 9.15 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్​ నుంచి బయటకు వచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. కవిత బయటకు వచ్చే ముందు కూడా టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. ఇదే సమయంలో పోలీస్​ వాహనాలు కూడా ఈడీ ఆఫీస్​ ఎదుట హడావుడి చేశాయి. దీంతో కవితను బయటకు పంపిస్తున్నారా లేక అరెస్ట్​ చేస్తున్నారా అనే పరిస్థితి నెలకొన్నది. కానీ, బయటకు వచ్చిన కవిత.. నేరుగా తన ప్రొటోకాల్​ వాహనంలో నేరుగా తుగ్లక్​ రోడ్డులోని సీఎం కేసీఆర్​ నివాసానికి వెళ్లారు. అక్కడ అప్పటి వరకు ఉన్న పార్టీ శ్రేణులు కవితకు స్వాగతం పలికారు. ఇంటికి వచ్చిన తర్వాత కవిత అటు మీడియా, ఇటు పార్టీ నేతలతో ఏం మాట్లాడకుండానే లోనికి వెళ్లారు. నిజానికి రాత్రిపూట మహిళను విచారించడం నిబంధనలకు విరుద్ధమంటూ, ఈడీ తీరును తప్పుబట్టిన కవిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ,  పీఎంఎల్‌ఏ యాక్ట్‌ ప్రకారం అనుమానితులను ఎంతసేపైనా ప్రశ్నించే అధికారం ఈడీకి ఉంది. ఈ కేసులో అనుమానితురాలిగానే కవిత పేరును ఈడీ హైలెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈడీకి ఉన్న సర్వాధికారాల నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు కవితను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. 

సౌత్​ గ్రూప్​ పైనే విచారణ
రెండోసారి ఈడీ విచారణలో ప్రధానంగా సౌత్​ గ్రూప్​ ప్రమేయంపై అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తున్నది. రూ.100 కోట్ల ముడుపులు, సౌత్​ గ్రూపులో ఎవరెవరు ఎంత షేర్​ ఇచ్చారు? ఎలా పంపించారు? వాటిని పంజాబ్​కు పంపించారా లేక ఢిల్లీలోనే అప్పగించారా? అనే కోణాలలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు టాక్. అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ముఖాముఖి విచారించినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా సౌత్‌ గ్రూప్‌తో లింకులకు సంబంధించి వివరాలను రాబట్టారు.  కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఆ తర్వాత అమిత్‌ అరోరా, మనీశ్‌ సిసోడియాతో కలిపి ప్రశ్నించారు, సాయంత్ర ఒకేసారి పిళ్లై, సిసోడియా, అమిత్​ అరోరా, కవితను విచారించారని టాక్​. ఈడీ ఆఫీస్​ వద్ద కవిత తరపు న్యాయవాదుల బృందం కూడా గంటల పాటు వెయిట్​ చేసింది. ఢిల్లీలో జోరుగా వాన పడుతున్నా, కవిత విచారణ నేపథ్యంలో పరిస్థితులు మాత్రం వేడెక్కాయి. 

పిళ్లై కస్టడీ పొడిగింపు
సోమవారంతో అరుణ్​ రామచంద్ర పిళ్లై కస్టడీ ముగియడంతో ఢిల్లీ స్పెషల్‌ కోర్టుకు తరలించారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో  స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో  పిళ్లై కస్టడీ కూడా అవసరమని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు ఈ కేసులో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో ఈడీ అధికారులు ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్నారు. కవిత విచారణ జరుగుతున్న సమయంలోనే.. రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో పిళ్లై కీలక నిందితుడిగా ఉన్నందున అతడి కస్టడీని పొడగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో పిళ్లై జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏప్రిల్ 3 వరకు పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మళ్లీ రండి
ఈ కేసులో కవితను మరోసారి విచారించేందుకు ఈడీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం రాత్రి విచారణ తర్వాత బయటకు పంపిన ఈడీ.. మంగళవారం కూడా మళ్లీ రావాలంటూ నోటీసు ఇచ్చి పంపించారు. ఈ నోటీసులపై కవిత సంతకాలు తీసుకున్నట్లు సమచారం. అంతేకాకుండా విచారణ తర్వాత కూడా కవిత నుంచి లిఖితపూర్వకంగా పలు ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే, మంగళవారం మళ్లీ విచారణకు పిలువడంతో.. పార్టీ నేతల్లో కొంత ఆందోళన నెలకొన్నది. విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్​ గౌడ్​ సహా.. పలువురు ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. సోమవారం  రాత్రి న్యాయ నిపుణులతో కొంతసమయం చర్చించినట్లు సమాచారం.