ఏడాది పాలన కూడా కష్టమే!

ఏడాది పాలన కూడా కష్టమే!
  • రేవంత్ సర్కార్ కు మూడింది 
  • పార్లమెంట్ ఎన్నికల నుంచే కాంగ్రెస్  పతనం ప్రారంభం
  • రాష్ట్రంలో ఆ పార్టీకి రెండు సీట్లు కూడా రావు
  • బీజేపీకి ఓటువేస్తే మంజీరాలో వేసినట్లే
  • తెలంగాణలో మళ్లీ కారు టాప్ గేరులోకి వస్తది
  • సుల్తాన్పూర్  సభలో కేసీఆర్ ధ్వజం

ముద్ర, తెలంగాణ  బ్యూరో : రేవంత్ సర్కార్ కు కాలం దగ్గర పడింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆ ప్రభుత్వం ఏడాది కాలం పాటు ఉండడం కూడా అనుమానంగానే కనిపిస్తోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన జ‌హీరాబాద్, మెద‌క్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్రసంగిస్తూ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విచుకుపడ్డారు. 

ఎన్నికలతోనే కాంగ్రెస్ పతనం ప్రారంభం..

పార్లమెంట్ ఎన్నికలతోనే కాంగ్రెస్ పతనం మొదలు కానుందని కేసీఆర్​ అన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాలి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ప్రస్తుతం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. దీంతో నాలుగు నెలల్లోనే ఆ పార్టీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందన్నారు. ఆ కోపాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ బుద్ది చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పలు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ మళ్లీ టాప్ గేర్ లోకి రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్  డౌన్ ఫాల్  ప్రారంభం కావడం ఖామమని.. అదే సమయంలో బీఆర్ఎస్​ పార్టీ తిరిగి పూర్వవైభవం దిశగా పరుగులు తీయనుందన్నారు.

త్వరలోనే బీజేపీలోకి రేవంత్..

సీఎం త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇప్పుడే ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో త్వరలోనే రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయన్నారు.  రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక‌టి మాట్లాడుతూ.. ఢిల్లీకి వెళ్లి ఇంకో మాట మాట్లాడుతున్నాడన్నారు. దీంతో ఎవ‌రికి ఎవ‌రికి బీ టీమో.. ఎవ‌రెవ‌రూ క‌లిసిపోయారోనన్న అంశంపై ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఇందులో ఏమ‌రుపాటుగా ఉంటే ఇబ్బంది జ‌రుగుతుందన్నారు. మరోసారి మోస‌పోతే దెబ్బతింటామన్నారు. మ‌న కండ్ల ముందే మ‌న‌లను మోసం చేస్తుంటే.. మ‌ళ్లీ వారికే స‌ద్ది క‌డితే నష్టపోతామన్నారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో మళ్లీ వ్యవసాయ రంగం కుదేలు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరిపడా సాగునీరు లేదు.. అవసరమైన గంటల పాటు కరెంటు సరఫరా కూడా కావడం లేదన్నారు. దీంతో రైతులంతా కూడా కాంగ్రెస్ పాలనపై గుర్రుగా ఉన్నారన్నారు. ఫలితంగాఅన్ని జిల్లాల్లో  రైతాంగా తిర‌గ‌బ‌డుతోందన్నారు. అందుకే నారాయ‌ణ‌పేట స‌భ‌లో సీఎం భ‌యం చూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందన్న సందేహాలు కలుగుతున్నాయన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓటు వేస్తే మంజీరా న‌దిలో ప‌డేసిన‌ట్టే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప‌దేండ్లలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క ప‌ని కూడా చేయ‌లేదని ధ్వజ‌మెత్తారు. 

రుణమాఫీపై మాట తప్పారు..

డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని కేసీఆర్​ అన్నారు. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తమని చెప్పి ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించారు. ప్రస్తుతం సర్కార్ రైతుబంధు నిధులను ఇవాళ్టి వరకు రైతులకు ఇవ్వలేదన్నారు.  పండిన పంటలను కొనే దిక్కేలేదన్నారు. కనీస మద్దతు ధర పోగా రూ.500 బోనస్‌ ఇస్తామన్నారన్నారు. కానీ వారిచ్చిన హామీల్లో ఒక్కటైనా అములు అవుతోందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. 

 ఇక్కడి నుంచే రాజకీయంగా ఎదిగా..

తాను రాజ‌కీయంగా ఎంతో ఎత్తు ఎద‌గ‌డానికి, రాష్ట్రం సాధించే పోరాట ప‌టిమ అందించి పెంచింది ఈ మెతుకుసీమే అని కేసీఆర్ అన్నారు. మీరిచ్చిన బ‌లంతోనే ఢిల్లీ మెడ‌లు వంచి తెలంగాణ రా ష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. మీ దీవెన‌లు, ఆశీర్వచ‌నాలు లేక‌పోతే, ఈ మెతుకు గ‌డ్డ ర‌క్తం, నీళ్లు నా శ‌రీరంలో లేక‌పోతే నాకు ఈ స్థాయి వ‌చ్చేదే కాదన్నారు. మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజార్టీ ఇచ్చి హ‌రీశ్‌రావు నాయ‌క‌త్వంలో ఏడుగురు ఎమ్మెల్యేలు స్థానాలు గెలిపించారన్నారు. ఎన్ని జ‌న‌మ్మెలెత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేనని అన్నారు. తెలివి లేనివాళ్లు..., అడ్డం పొడ‌వు మాట్లాడేవాళ్లు బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఓట్లు సీట్లు ఎందుకు అని అంటున్నారు. కానీ ఇప్పుడే కావాలి ఓట్లు.... సీట్లు అని అన్నారు. ఎందుకంటే ఆనాడు మీరు ఆశీర్వదించ‌క‌పోతే క‌రీనంర‌గ్ ఎంపీగా గెల‌వక‌పోతే పార్లమెంట్‌లో తెలంగాణ బిడ్డగా గ‌ర్జించ‌క‌పోతే తెలంగాణ ఎలా వ‌చ్చి ఉండేది కాదని కేసీఆర్​అన్నారు.