మేడిగడ్డకు కాదు..  బొందల గడ్డకు పోండి

మేడిగడ్డకు కాదు..  బొందల గడ్డకు పోండి
  • కేఆర్ఎంబీకి అప్పనంగా ప్రాజెక్టులు అప్పగించారు
  • చేతనైతే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి
  • దమ్ముంటే ప్రాణహితలో ఉన్న నీళ్లను ఎత్తిపోయండి
  • కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆట బొమ్మ కాదు
  • చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ లోనే కరెంట్ పోతోంది
  • తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను
  • పులిలా పోరాడుతా తప్ప.. పిల్లిలా ఇంట్లో ఉండను
  • ప్రజలు పాలిచ్చే బర్రెను అమ్మి.. దున్నపోతును తెచ్చుకున్నరు
  • పాలన చేతకాక కాంగ్రెస్​ ప్రజలను పట్టించుకోవడం లేదు
  • వారికి కావాల్సింది పైసలు....పైరవీలే
  • ‘చలో నల్లగొండ’ సభలో గర్జించిన కేసీఆర్

కేసీఆర్ ను సంపి బతికి బట్టకడతారా?

ప్రజల హక్కులకు భంగం కలిగితే బతకనీయం.. వేటాడుతం.. వెంటాడుతం. రైతు బంధు అడిగిన రైతులను చెప్పుతో కొడుతమంటారా? ఎంత కండ కావరంరా మీకు..? రైతులకు కూడా చెప్పులుంటయ్. అవి ఇంకా గట్టిగుంటయ్.. వాళ్లు కొడితే మూడు పండ్లు రాలుతయ్. ప్రజల కోసం.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఈ కేసీఆర్​నే రాష్ట్రంలో తిరగనీయరా?  సంపుతరా? దమ్ముంటే రండి.. సంపుదురు రండి! అని బీఆర్ఎస్​ అధినేత  కేసీఆర్ కాంగ్రెస్​ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను సంపి బతికి బట్టకడతరా? అని నిప్పులు కురిపించారు.

ముద్ర, సూర్యాపేట, తెలంగాణ బ్యూరో : ‘మేడిగడ్డ పోతాం.. బొందల గడ్డ పోతాం.. అంటున్నారు.. అక్కడకు పోయి ఏం పీకుతారు. దమ్ముంటే ప్రాణహితలో ఉన్న నీళ్లను ఎత్తిపోయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆట బొమ్మ కాదు.. గతంలో నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టు, కాడెం ప్రాజెక్టులకు ఇబ్బంది రాలేదా? ఇబ్బందులు వస్తే సరి చేయాలే తప్ప మాటలతో ప్రభుత్వం కాలయాపన చేయడం ఎందుకు? అసెంబ్లీ తర్వాత మేము కూడా మేడిగడ్డ పోతాం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రజలకు చెబుతాం. గతంలో నాగార్జున సాగర్, కడెం, మూసీ ప్రాజెక్టుల పిల్లర్లు కుంగిపోలేదా? రిపేర్ చేయలేదా? పిల్లర్లు కుంగిపోతే సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? మీకు తెలివి లేకుంటే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లం కదా’’ అని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్  రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ మంగళవారం చలో నల్గొండ పేరిట జిల్లా శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తనదైన శైలిలో రెచ్చిపోయారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

రేవంత్​పై కేసీఆర్​సెటైర్లు

సీఎం రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్​సెటైర్లు వేస్తూ విరుచుకుపడ్డారు.  రాష్ట్రంలో ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు.. అయినప్పటికీ చ‌లో న‌ల్లగొండ స‌భను నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అయితే రాజ‌కీయ స‌భ కానేకాదు.. ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ అని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఒక్క పిలుపుతో పులుల్లాగా క‌దిలివ‌చ్చిన అన్నాచెల్లెల్లు, అక్కాత‌మ్ముళ్లకు ఉద్యమాభివ‌నంద‌నాలు తెలుపుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. నాకు కాలు విరిగిపోయినా కుంటి న‌డ‌క‌తోనే, క‌ట్టె ప‌ట్టుకుని ఇంత ఆయాసంతో ఎందుకు రావాల్సి వ‌చ్చిందంటే ద‌య‌చేసి అంద‌రూ ఆలోచించాలి అని కేసీఆర్ కోరారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మేము మళ్లీ రెండు మూడింతల బలంతో అధికారంలోకి వస్తామని కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. నదుల మీద, నీటిమీద  కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శించారు. నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని అసెంబ్లీ తీర్మానం చేయడంతో ఈ సమస్య అయిపోదని, కృష్ణా నది జలాల్లో మొత్తం నీటి వాటాలు తేలేదాకా సమస్య ఉంటుందన్నారు. న్యాయమైన ప్రజల హక్కుల కోసం వాటాల కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. చావు నోట్లోకి పోయి తెలంగాణ తీసుకు వచ్చిన నాకు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆరాటం ఉంటదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం మరోసారి పులిలా పోరాడుతా తప్ప.. పిల్లిలా ఇంట్లో ఉండనని  కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఈ కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తన  ప్రాణం ఉన్నంత వరకు ఈ కట్టే కాలే వరకు వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు. 

మనది జీవన్మరణ సమస్య..

నీళ్ల మీద మ‌న హ‌క్కు అనేది మ‌నంద‌రి బ‌తుకుల‌కు జీవ‌న్మర‌ణ స‌మ‌స్య అని అన్నారు. దీనిపై ప్రస్తుతం చావో రేవో తేల్చేకునే సమయం ఆసన్నమైందన్నారు. దీనిపై 24 ఏండ్ల నుంచి ప‌క్షిలాగా తిరుగుకుంటూ రాష్ట్రం మొత్తం చెబుతూ వచ్చానని అన్నారు. కృష్ణా, గోదావారి జలాల్లో రాష్ట్రం వాటా సరిగ్గా తేలకపోతే మ‌న‌కు బ‌తుకు లేదన్నారు. ఫ్లోరైడ్ సమస్య వల్ల నల్లగొండ ప్రజల నడుములు వంగిపోయాయన్నారు. ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి నాటి ప్రధానికి చూపించామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య తీరిందని చెప్పారు. ఇప్పుడు నల్లగొండ ఫ్లోరైడ్​రహిత జిల్లాగా అవతరించిందని అన్నారు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారన్నారు. కానీ తాము అలా కాదని నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులమని చెప్పారు. 

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా కొట్లాడతామన్నారు. అసమర్థ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పోయి.. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చేలా సంతకం పెట్టి వచ్చారని మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ నిలదీస్తేనే అధికార పార్టీ భయపడి సభలో తీర్మానం పెట్టిందన్నారు. అది కూడా సరిగ్గా పెట్టలేదని మండిపడ్డారు. అందులో విద్యుత్ సంగతి లేనేలేదని విమర్శించారు. అందుకే మీకు మళ్లీ దండంపెట్టి చెప్తున్నా.. నేను మీ బిడ్డను, చావు నోట్లో తలకాయ పెట్టి చావు వరకూ పోయి తెలంగాణ తెచ్చానని అన్నారు. అందుకే రాష్ట్రం బాగు కోసం నాకు తన్నులాట ఉంటదన్నారు. బీఆర్ఎస్​పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పడ్డట్లు మీ ఫోన్లు టింగ్ టింగ్ అని మోగేవన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో వారి వాగుడే వినబడుతోందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ మీరేం ఫికర్ కావొద్దు.. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తదని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్  వాళ్లు చెప్పిన విధంగా బోనస్ రూ.500 ఇవ్వరట అని ఎద్దేవా చేశారు.

దద్దమ్మల పాలన గిట్లనే ఉంటది

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంటు పోయిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. పదేళ్లలో రెప్పపాటు పోని కరెంటు ఇయ్యాలా గంటల తరబడి ఎందుకు పోతుందని  ప్రశ్నించారు. దద్దమ్మలు పాలన చేస్తే గిట్లనే ఉంటుందని మండిపడ్డారు. కేసీఆర్ పోంగనే కరెంట్ పొతదా? దీనిపై అధికార పార్టీ నేతలను నిలదీయండి! అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 5,600 మెగావాట్ల కరెంటు ఉన్నా ఎందుకు ఇస్తలేరు? అని నిలదీశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ లోనే కరెంట్ పోతున్నదని విమర్శించారు. దీంతో అసెంబ్లీలోనే జనరేటర్లు తెచ్చి పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడే  కరెంటు పరిస్థితి ఇలా ఉంటే రానున్న ఏప్రిల్, మే నెలల్లో 24 గంటల కరెంటు ఇస్తరా? అని ప్రశ్నించారు. నేను తొమ్మిదిన్నరేళ్లు 24 గంటల కరెంటు ఇచ్చా. ఇప్పుడు కరెంటు ఏమైపోయింది? అని అడిగారు. చేతగాని వాళ్ల రాజ్యం ఇలాగే ఉంటుందన్నారు. మేం ఇచ్చినట్లుగానే కాంగ్రెస్  ప్రభుత్వం కూడా 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

కేసులు వేసినా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం

బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు ముందుకు సాగకుండా కాంగ్రెస్ నేతలు అడుగడుగునా కోర్టుల్లో కేసులు వేసినా  ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లామని కేసీఆర్​ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికే 80 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేస్తే మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయన్నారు. మన నీళ్లు దొచుకునేందుకు వస్తున్న వారికి ఈ సభ ఒక హెచ్చరికలాంటిందన్నారు. అందుకే ఇది చిల్లర మల్లర సభ కాదన్నారు. అందరికీ హెచ్చరిక లాంటిందన్నారు. 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య అని కేసీఆర్ పేర్కొన్నారు.

మంత్రులకు సోయి లేదు

ఉమ్మడి రాష్ట్రంలో బాగుండె.. ఇప్పుడు బాగా లేదంటూ సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర బడ్జెట్ గురించి  అసెంబ్లీ లో మాట్లాడకుండా.... అర్జెంటుగా శాసనసభలో ఒక తీర్మానం పెట్టి మమ అనిపించుకున్నారని విమర్శించారు. ఇదే నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యపై గతంలో వారం రోజులు పార్లమెంటు జరగనీయకుండా కొట్లాడినమన్నారు. కేంద్రానికి వందలాది ఉత్తరాలు రాశామన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మోటర్లు బిగించాల్సిందేనని ప్రదాని నరేంద్రమోడీ నన్ను బెదిరించాడని, అయినా లొంగలేదని కేసీఆర్​అన్నారు.