ఇద్దరు జీఎస్టీ అధికారుల కిడ్నాప్

ఇద్దరు జీఎస్టీ అధికారుల కిడ్నాప్
  • ట్యాక్స్ కట్టకపోవడంతో షాప్​ను సీజ్​చేయడానికి వెళ్లిన ఆఫీసర్లు
  • అపహరించి కారులో తరలించిన నిందితులు
  • రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్​
  • ఫోన్​సిగ్నల్స్​ఆధారంగా నిందితుల పట్టివేత

ముద్ర, తెలంగాణబ్యూరో : జీఎస్టీ కట్టకపోవడంతో షాప్​ను సీజ్ చేసేందుకు వెళ్లిన జీఎస్టీ అధికారిని ఓ దుకాణం ఓనర్,​అతడి స్నేహితులు కలిసి కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. బుధవారం దిల్ సుఖ్ నగర్ లోని  కృష్ణానగర్ లో ఓ షాపు యజమాని జీఎస్టీ కట్టలేదు. దీంతో స్క్రాప్, వెల్డింగ్ షాప్ ను  సీజ్ చేసేందుకు సరూర్ నగర్ జీఎస్టీ  అధికారి మణిశర్మ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో మణిశర్మతోపాటు మరో అధికారి ఆనంద్ ను సదరు షాపు ఓనర్ సహా మరో ముగ్గురు కలిసి కిడ్నాప్ చేసి, వారిపై దాడి చేశారు. అనంతరం జీఎస్టీ అధికారుల ఐడీ కార్డులు లాక్కుని, వారిని కారులో తీసుకుపోయారు. రూ.5 లక్షలు ఇస్తేనే వదిలేస్తామని డిమాండ్ చేశారు. దీంతో జీఎస్టీ అధికారి మణిశర్మ వెంటనే కిడ్నాప్, రూ.5 లక్షల గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా ఘటనా స్థలానికి నాలుగు కిలో మీటర్ల లోపే కిడ్నాపర్ల వాహనం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం రాజీవ్ చౌక్  వద్ద నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సరూర్ నగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. అయితే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద నలుగురు నిందితులు వీరంగం సృష్టించారు. తమను పోలీసులు కావాలనే అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

అధికారుల కిడ్నాప్ పై కేంద్రం సీరియస్

హైదరాబాద్ లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ ఉదంతంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్ ను ఫోన్ లో మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.