హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి

హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి
  • హోమ్​మినిస్టర్ ​అమిత్ షాతో అత్యవసర భేటీ!
  • మోడీ సభకు ముఖ్యనేతల గైర్హాజర్​పై ఆరా?

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్ రెడ్డి సోమవారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర హోమ్​మంత్రి అమిత్ తో అత్యవసర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా రెండు రోజుల క్రితం పాలమూరుకు వచ్చిన ప్రధాని మోడీ సభకు పార్టీలోకి ముఖ్య నేతలు ఎందుకు హాజరుకాలేదన్న అంశంపై కిషన్ రెడ్డిని అమిత్​షా ఆరా తీసినట్లు సమాచారం. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయని కిషన్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఎందుకు పార్టీ ముఖ్యనేతల్లో సమన్వయం కొరవడిందని, ఎన్నికలు తరముకొస్తున్న సమయంలో నేతల వ్యవహారంపై అమిత్ షా పూర్తి స్థాయిలో అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

నిజామాబాద్ పర్యటనపై చర్చ..

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రధాని మోడీ నిజామాబాద్ పర్యటనకు సంబంధించి కిషన్​రెడ్డితో అమిత్​సా చర్చించారని తెలుస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఇప్పటికే ముఖ్య నేతల అభ్యర్థిత్వంపై  పార్టీ అధినాయకత్వం ఒక క్లారిటీకి వచ్చిందని, బీజేపీ సీఈసీలో చర్చించిన తర్వాత.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనెల రెండో వారంలోనే ఏకాభిప్రాయం కుదిరిన దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల అభ్యర్థులను  ప్రకటించే అవకాశముందని సమాచారం. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని, వీలైనంత ఎక్కువ సార్లు ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటిస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందన్న అంశంపై కూడా వారు చర్చించారని తెలుస్తోంది. మంగళవారం నిజామాబాద్ తోపాటు త్వరలో కరీంనగర్, నిర్మల్‌లలో కూడా ప్రధాని మోడీ పర్యటించేలా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా సమాచారం. అయితే నిన్నమొన్నటి వివిధ పార్టీల చేరికలతో కళకళలాడిన బీజేపీలో ప్రస్తుతం ఆ వైభవం కనిపించడం లేదు. ముఖ్యనేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అవ్వడానికి గల కారణాలపై అమిత్ షా తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.