పేదోడి సొంతిటి కలను నెరవేర్చండి

పేదోడి సొంతిటి కలను నెరవేర్చండి
  • డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా...రూ. 3లక్షల పథకమా తేల్చండి
  • దరఖాస్తుదారులందకి గృహవసతి కల్పించండి
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి TV కూనంనేని సాంబశివరావు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం :పేద వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వ చర్యలు వేగవంతం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు, రూ.3లక్షల పథకం అమలు చేయాలని, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలను సరిచేసి నిజమైన పేదలకు న్యాయం చేయాలని, ఇండ్లకు అర్హత పొందిన వారికి గృహవసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణంలోని వివిధ బస్తీల నుంచి తరలివచ్చిన పేద వర్గాల నినాదాలతో కార్యాలయ ప్రాంతం మార్మోగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుందే తప్ప పేదల బ్రతుకుల్లో మార్పులు రావడం లేదని, ఎన్నో ఏండ్లుగా పేదలకు ఉండేందుకు గూడు కల్పించే విషయంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇడ్లు, రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. పట్టణ పేదలకోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపనలు ఏండ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తి చేయకపోవడం పేదలపట్ల పాలకులకు ఉన్న నిర్లక్ష్యం స్పష్టమవుతోందన్నారు. జనాభా ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టకుండా అరకొర నిర్మాణం చేపట్టడం పేదలను మోసం చేయడమేనన్నారు. పాల్పంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలకు అధికార యంత్రాంగమే భాద్యత వహించాలని, తప్పులను సరిచేసి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హత సాధించి డ్రాలో ఇండ్లు పొందని వారికి పాతకొత్తగూడెం, రామవరం, ప్యూన్ బస్తి తదితర ఏరియాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు కేటాయించి ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల పథకాన్ని అమలు చేయాలని, రైల్వే నిర్వాసితులకు ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడిన వలస కుటుంబాలకు, ఇతర పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహశల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, జి.నగేష్, మునిగడప వెంకటేశ్వర్లు, కె.రత్నకుమారి, కౌన్సిలర్లు, నాయకులు మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, నేరెళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.