నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కూచాడి శ్రీహరి రావు

నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కూచాడి శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ జాబితా విడుదల చేసింది. మామడ మండలం దిమ్మదుర్తి కి చెందిన శ్రీహరి రావు వృత్తిరీత్యా న్యాయవాది.  గుల్బర్గా నుంచి న్యాయ శాస్త్ర పట్టా పొందిన ఈయన 1995లో కాంగ్రెస్ నుంచి మామడ మండలాధ్యక్షునిగా గెలుపొందారు. అదే ఏడాది యువజన కాంగ్రెస్ అభ్యర్థిగా నియమితులయ్యారు. 2001లో మామడ జడ్పీటిసి గా ఎన్నికైన అనంతరం జడ్పిలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. 2002లో ఆదిలాబాద్ జిల్లా  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2005లో పిసిసి సభ్యులుగా ఉన్నారు. 2007లో టీ ఆర్ ఎస్ లో చేరారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా ఎదిగిన ఈయన 2009 లో టీ ఆర్ ఎస్ నుండి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2010 నుంచి మూడేళ్ల పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2014లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 లో ప్రస్తుత మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది జూన్ 14న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు విశేషంగా కృషి చేశారు.