కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక పోరాటాలు

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక పోరాటాలు
  • కార్మికుల సదస్సులో వామపక్ష సంఘాల  తీర్మానం

ముద్ర ,ప్రతినిధి, మంచిర్యాల : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై  కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్లు వామపక్ష కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. బుధవారం మంచిర్యాల లో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులతో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటియూసీ సింగరేణి విభాగం ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకరణ చేస్తూ కార్మిక రంగ సంక్షోభాన్ని సృష్టిస్తుందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయితే అన్ని రకాల ఉత్పత్తుల ధరలు పెరిగి సామాన్యులపై ఆర్థిక పెనుభారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు ధారాధత్తం చేయడంతో పాటు కార్మిక చట్టాలను కూడా నాలుగు చట్టాలుగా కుదించారని విమర్శించారు. మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే నూతన కార్మిక చట్టాలు అమలులోకి వస్తాయని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ అనుసరించే విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్మికులతో కలిసి దేశవ్యాప్తంగా వామపక్ష సంఘాలు కార్మికులతో పోరాటాలకు సన్నద్ధమయ్యాయని సీతారామయ్య చెప్పారు. ఈ సమావేశంలో సిఐటియూ నాయకుడు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, ఐఎఫ్టీయూ నేత శ్రీనివాస్ ఇతర నేతలు పాల్గొన్నారు.