హోరా హోరీగా స్థానిక సంస్థల ఉప ఎన్నిక

హోరా హోరీగా స్థానిక సంస్థల ఉప ఎన్నిక
  • క్రాస్ ఓటింగ్  జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు

ముద్ర, షాద్ నగర్: మహబూబ్  నగర్ స్థానిక సంస్థల  ఉప ఎన్నికలు  హోరాహోరీగా జరుగుతున్నాయి. క్రాస్ ఓటింగ్  జరగకుండా ఓటర్ల మనసు మారకుండా ఎన్నికల కేంద్రం వద్ద  ఇరు పార్టీల నాయకులు తిష్ట వేసుకొని కూర్చున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని  ఫరూఖ్ నగర్, కేశంపేట, కొందుర్గు, నందిగామ, కొత్తూరు, చౌదరి గూడెం ఆరు మండలాలతో పాటు  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోని  తలకొండపల్లి, ఆమనగల్, మాడుగుల, కడ్తాల్ నాలుగు మండలాల స్థానిక సంస్థల ఓటర్లకు  ఫరఖ్ నగర్  మండల పరిషత్ కార్యాలయంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, పురపాలక కౌన్సిలర్ల ను కాపాడుకునేందుకు గత వారం రోజులుగా క్యాంపులను నిర్వహించాయి. క్యాంపు ల నుంచి నేరుగా  వారిని బస్సుల్లో ఎన్నికల కేంద్రానికి నాయకులు తరలించారు. ఎన్నిక జరుగుతున్న మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో  ఇరు పార్టీల  నాయకులు టెంట్లను వేసి  ఓటు వేసేందుకు వెళ్తున్న అభ్యర్థులను  తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. షాద్ నగర్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  మాజీ ఎమ్మెల్యేలు ఎల్గమోని అంజయ్య యాదవ్, చౌల్లపల్లి ప్రతాప్ రెడ్డిలు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో  ఉండి ఎన్నికల ప్రక్రియను సమీక్షిస్తున్నారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన  స్థానిక సంస్థల ఉపఎన్నిక మధ్యాహ్నం 12 గంటల వరకు 80 శాతం  ఓట్లు పోలయ్యాయని రిటర్నింగ్ అధికారి పార్థసారథి తెలిపారు. మరో రెండు గంటల్లో పూర్తిస్థాయిలో ఓట్ల నమోదు కావచ్చని ఆయన అన్నారు. ఇది ఇలా ఉండగా గెలుపు పై  ఎవరికి వారే ధీమాను  వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ పై  ఆశలు పెట్టుకోగా, తమకున్న బలంతో పాటు  స్వతంత్ర, భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల  ఓటర్లు తమకు అదనపు బలమని  భారీ మెజార్టీతో  గెలవడం తధ్యమని  బిఆర్ఎస్ నాయకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.