కష్టపడి ఇష్టంగా చదివితే దేనినైనా సాధించవచ్చు - డియస్ఓ వెంకటేశ్వర్లు

ముద్ర న్యూస్, నల్గొండ : ఎం వి యన్ ట్రస్ట్ కల్పిస్తున్న అవకాశాలతో నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని నల్గొండ జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం నాడు ఎంవీఎం కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ అభ్యర్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించడాని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. జీవితంలో ఎవరు ఓడిపోరని ఎక్కడో అక్కడ స్థిరపడతారని పేర్కొన్నారు. ఎన్ని పనులు చేసిన అంతిమ లక్ష్యంగా గౌరవపద ఉద్యోగం పొందాలన్నదే ప్రతి ఒక్కరి ఉద్దేశం అన్నారు. నేటి విద్యార్థులు చదవడం కంటే వినటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని అలా కాకుండా చదివి ఆ వెంటనే నోట్స్ రాయాలని సూచించారు.

ముఖ్యంగా ప్రతిరోజు పత్రికలో చదవడం అలవర్చుకోవాలని పత్రికలు చదవడం ద్వారా సగానికి పైగా లక్ష్యాన్ని సాధించినట్లే అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు వేసిన అందులో నాకు రావాలి అనే పట్టుదలతో చదవాలని కోరారు. ఉద్యోగం సాధించాలంటే ప్రతి ఒక్కటి అవగాహన చేసుకుని విషయ పరిజ్ఞానంతో ఆన్సర్ చేయాలని కోరారు. పరీక్ష కూడా ఎలా రాయాలి ఎంత సమయంలో రాయాలి అనే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కష్టపడి ఇష్టంగా చదివితే దేనినైనా సాధించవచ్చున్నారు. ఈ భోజన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కూడా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కన్వీనర్ అక్కనపల్లి మీనయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పీ. నర్సిరెడ్డి, సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, ఎండి సలీం, తుమ్మల పద్మ, పరిపూర్ణ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.