మది వీణలు మోగే యాదిలో–-2

 మది వీణలు మోగే యాదిలో–-2
madhi veenalu moge yaadhi lo 2

దేశానికి పట్టుగొమ్మలు పల్లెటూర్లే అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. వ్యవసాయమే దేశ ప్రజల జీవనాధారం అని మనకు చరిత్ర చెబుతుంది. ఉత్తర భారతంలో గోధుమలు ముఖ్య ఆహారమైతే, దక్షిణ భారతంలో వరి బియ్యం ప్రధాన ఆహారం. ఇప్పటికీ అదే అలవాటు కొనసాగుతున్నది. దానికి అనుగుణంగా మా ఊరు వెలికట్ట కూడా పూర్తిగా వ్యవసాయాధారిత జీవనం సాగించిన  గ్రామం. ఇక్కడ ప్రజలు చేను చెలకలో ఎగుసాయం చేసుకొని వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ (పల్లీ), ఉలువలు మొదలగు పంటలు పండించేవారు. ఇది మా తాతల నాటినుంచీ వస్తున్న వ్యవసాయ తీరుతెన్నులు. లావాదేవీలన్నీ ధాన్యం మాధ్యమంగానే నడిచేవి. నగదు వ్యవహారాలు బహు స్వల్పమే. ఇదే ప్రజల ముఖ్య జీవనాధారం. ఇప్పటికీ కొంత మేరకు వ్యవసాయం చేస్తున్నా కాలానుగుణంగా యాంత్రిక విధానం, గ్లోబలైజేషన్ వలన ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి.

అప్పట్లో మా తాత తాడూరు పాపయ్య గారి కుటుంబం ఉమ్మడి కుటుంబంగా  ఉండేవారట. నలుగురు మొగ పిల్లలతో  పాటు ఇద్దరు ఆడపిల్లలు మా తాత పాపయ్య మా నాయనమ్మ తాడూరు లక్ష్మమ్మ గారి సంతానం.  వీరికి దాదాపు 60--70 ఎకరాల తరి ఉండేదట. ఆనాటి ఆ ఉమ్మడి కుటుంబంలో క్రీ .శ 1900-1945 మధ్య కాలంలో వ్యవసాయ వైభవం తరువాత్తరు వాత కాలంలో కారణాంతరాలతో క్షీణ దశ ఎలా ఉండెనో మా పెద్దన్న తాడూరు మోహనాచార్యులు తను13 యేండ్ల వయసులో 1955లో 9వ తరగతి చదివేప్పుడు రాసిన ఒక పద్యం మనకు కనులకు కట్టినట్లుగా దృశ్యీకరించింది. అదే పద్యం మీకోసం... 

సీ. ఇరువది నాగండ్ల వృషభ సంపదయేది? గుమ్ములకొద్ది ధాన్యమ్మునేది? 
      పనిపాటలరసెడు పనివారలికయేరి? బంధుమిత్రుల రాకలెందుబోయె? 
      పూబోండ్ల మేనుల పుత్తడి నగలేవి? ఆనంద రస సమాస్వాదమేది ?
      అన్నదమ్ముల మోములందు హాసములేవి? పరివారమున్నత పరిధి యేది?

 గీ.  క్రూరవిధి వక్రదృష్టి ప్రసారమునను 
       అతుల భీకర వికటాట్టహాసమునను
        ధ్వంసమొనరించె పరివార భద్రగుణము
        బాగుపడు కాలమెప్పుడు వచ్చునొక్కొ!!

మా పెద్దన్నయ్య తాడూరు మోహనాచారి చేతిరాతలోని ఈ పద్యం దాదాపు 18–-19వ శతాబ్దాలకు చెందిన గువ్వల చెన్న శతక కవిని తలపిస్తుంది. ఆయన తన శతకంలో ‘ఇల వృతులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా’ అని ప్రబోధించారు. వీరు బద్దెన,వేమన శతకకర్తల సమకాలికుడు. సామాజిక రుగ్మతలపై కలాన్ని ఝళిపించిన ఈ కవి రాయలసీమకు చెందినవాడు. దాదాపుగా అదే స్ఫూర్తితో  వ్యవసాయంతో పాటు కులవృత్తి పనులకూ పెద్ద పీట వేసింది మా వూరు. ఆ కాలంలో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, అవుసలి, వైశ్య, శాలలు, గౌండ్ల, గొల్ల, చాకలి, మంగలి, తెలుగ, ముత్రాస, ఎరుకల, మొదలగు కులవృత్తులవారు వారి వృత్తి పనితో జీవనం గడిపినారు. మిగిలిన వారు టీచర్లు, పట్వారీ, పటేల్ గిరి, వైద్యం తదితర వృత్తులలో జీవించారు.

మొత్తానికి గ్రామసీమ ప్రశాంత వాతావరణంలోతాత, అన్న, బావ, అమ్మ, అక్క, చెల్లె వంటి మంచి వరుసలతో, బంధాలతో సంతోషంగా తృప్తిగా బతికినారు. ఇప్పుడు అలాంటి  వాతావరణం కనిపించదు. ఇది బాధాకరమే కొంత.సామాజిక సమైక్య జీవనం కొన్ని మార్పులు చేర్పులతో ఇప్పటికీ సజీవమే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో కేంద్రక కుటుంబ వ్యవస్థ (nucleus family) రూపుదిద్దుకుంది. బంధుత్వాలు సన్నని దారంలా మిగిలాయి.వాటి స్ధానంలో సామాజిక స్నేహబంధాలు బతుకడం కొంతవరకు Relations Compensate అయినందుకు సంతోషంతో ఆహ్వానించదగ్గ విషయమే! (ఇంకా ఉంది..).

డా.టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871