నిరుపేదల ఆశయాలు, ఆశలతో ఆడుకోవద్దు..

నిరుపేదల ఆశయాలు, ఆశలతో ఆడుకోవద్దు..
  • లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి..
  • డబుల్ బెడ్ రూమ్ ఇల్లు..పేదవాడి కల..
  • మాజీ జడ్పిటిసి మల్లు గారి నర్సాగౌడ్..

ముద్ర, గంభీరావుపేట : ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా నిరుపేదల ఆశయాలు,ఆశలతో ఆడుకోవద్దని,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, అర్హులైన లబ్ధిదారులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సాగౌడ్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు గారి నర్సాగౌడ్ మాట్లాడుతూ 2016లో గంభీరావుపేట మండల కేంద్రంలో 60 ఇండ్లను మంత్రి కేటీఆర్ మంజూరు చేశారని,గంభీరావుపేట పెద్ద విలేజ్ అని ఆ  ఇండ్లు సరిపోవని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తే సుమారు 272 ఇండ్లు మంజూరు చేశారని అన్నారు.  ఎటువంటి పైరవీ లేకుండా,జవాబిదారితనంతో, పారదర్శకంగా గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆనాడు మంత్రి కేటీఆర్ చెప్పారని అన్నారు. చివరిసారిగా గ్రామసభ పెట్టి పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తామని అధికారులు చెప్పారని అన్నారు.  

మంత్రి కేటీఆర్ బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి వస్తున్న తరుణంలో   లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ లిస్ట్ అడిగితే తహసిల్దారు,  గ్రామపంచాయతీ అధికారులు ఫైనల్ లిస్ట్ కాలేదని చెబుతున్నారని అన్నారు. కొంతమంది బయట లిస్ట్ పట్టుకొని, మీకు వచ్చింది, మీకు రాలేదని చెబుతున్నారని,  నాలుగుసార్లు లిస్టులో పేరు వచ్చి, ఇప్పటి లిస్టులో పేరు రాలేదని చెబుతున్నారని, దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. మా పేరు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే లబ్ధిదారులను బెదిరిస్తున్నారని,  మాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తదో రాదో అని చాలామంది పేదలు ఆందోళన చెంది హాస్పటల్ పాలైతున్నారని,నిరుపేదలు ఆశలు, ఆశయాలతో ఆడుకోవద్దని,  మంత్రి కేటీఆర్ కి చెడ్డ పేరు వచ్చే విధంగా కొంతమంది నాయకులు, అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.మంత్రి కేటీఆర్ చేతుల ఒకరిద్దరికీ అర్హులైన  లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీ ఇచ్చి, మిగతా లబ్ధిదారులను గ్రామ సభ ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా,  పారదర్శకంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.