ముందుకు సాగని  మన ఊరు–మనబడి

ముందుకు సాగని  మన ఊరు–మనబడి
  • తొలి విడుత టార్గెట్​9,123 స్కూళ్లు
  • పనులు పూర్తయ్యింది 1,210 బడులలోనే
  • వర్క్​చేయలేమంటున్న విద్యా కమిటీలు
  • అంచనాలకు అందని ఎస్టిమేట్ ధరలు
  • నష్టాల పాలవుతున్నామని ఆవేదన
  • బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూపు
  • ఇసుక ధరలనూ చేర్చని అధికారులు

 ముద్ర, తెలంగాణ బ్యూరో: పక్కనే ఉన్న ఏపీ సర్కారు తీసుకున్న ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని కాపీ కొట్టిన తెలంగాణ ప్రభుత్వం బడులను బాగు చేయడంలో మాత్రం విఫలమవుతున్నది. తెలంగాణలో వీఆర్ఎస్​ తీసుకున్న రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి ఏపీ పాఠశాలలను డెవలప్​చేయడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడి ప్రభుత్వం మురళిని సలహాదారుడిగా నియమించుకుని ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచే బాధ్యతలను అప్పగించింది. ఇదే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ‘మన ఊరు–మన బడి’  కార్యక్రమంగా తీసుకుంది.

కానీ, ఏపీలో సక్సెస్​ అయిన ఈ స్కీం మన దగ్గర మాత్రం ముందుకు సాగడం లేదు. నిర్దేశించిన లక్ష్యం నీరుగారుతున్నది. ఆయా పాఠశాలలో  రూ.30 లక్షల లోపు పనుల నిర్ణయాలన్నీ విద్యా కమిటీలు తీసుకోవాలి. సరిపడా ఎస్టిమేట్లు లేకపోవడం, నిర్మాణాలలో కీలకంగా ఉండే ఇసుకకు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యా కమిటీలు పనులు చేయలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఈ యేడాది 9,123 స్కూళ్లను టార్గెట్ గా పెట్టుకుంటే,1,210 స్కూళ్లలో మాత్రమే కొంత మేరకు పనులు చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తొలి విడుతలో 5,399 ప్రాథమిక, 1,009  ప్రాథమికోన్నత, 2,715 ఉన్నత పాఠశాలలు ఎంపిక చేశారు. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు మొత్తం 12 అంశాలకు సంబంధించిన అంచనాలు, బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40 శాతం పంచాయతీరాజ్‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లలో కొంత శాతం నిధులను ఈ పథకం కోసం కేటాయించారు. 

ముందు నుంచే వెనకడుగు
నిరుడు ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించినా, ముందుగానే సాఫ్ట్​వేర్​ సమస్యలు వచ్చాయి. ప్రారంభ సమయంలో సాప్ట్ వేర్  అప్ డేట్ కాకపోవడం, ఎస్టిమేట్​ ధరలలో తేడాలు ఉండటంతో అవాంతరాలు ఏర్పడ్డాయి. దాదాపు నెల రోజుల తర్వాత వీటిని ఆమోదించి, విద్యా కమిటీ చైర్మన్, స్కూల్​హెడ్ మాస్టర్ తో జాయింట్​ ఖాతాలు తీసి పది శాతం నిధులను జమ చేశారు. కానీ, పనులు మాత్రం దశలవారీగా, ఆలస్యంగా మొదలయ్యాయి. పాఠశాల కాంపోనెంట్ వారీగా పనులు చేపట్టిన విద్యాకమిటీలు ఇంజనీర్లు చేసిన ఎంబీ రికార్డులతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పెట్టిన పెట్టుబడికి 70 శాతం కూడా తిరిగి రావడం లేదని తేలింది. ప్రభుత్వం ఎస్టిమేట్ లో సూచించిన సలాక ధర కిలోకు రూ. 80, సెంట్రింగ్ చార్జీలు రూ.15 కలుపుకొంటే రూ. 95 చేరింది. కానీ, ప్రభుత్వం ఫ్యాబ్రికేషన్ చార్జీలతో కలుపుకొని కేవలం రూ. 71 మాత్రమే చెల్లిస్తున్నది. దీనితో పనులు చేసిన విద్యా కమిటీలు/ఏజెన్సీలు నష్ట పోవాల్సి వస్తున్నది. నల్లాలు, టైల్స్, పాలిష్ బండ  వేయడంలో కూడ ఎస్టిమేట్లలో ఉన్న ధరల కన్నా 30 శాతం అదనంగా ఉండటంతో విద్యా కమిటీలు చేపట్టిన పనులను మధ్యలోనే వదిలేశారు. ముందుగానే నష్టాలు రావడంతో ఏజెన్సీలు మిగతా పనులు చేయడానికి ముందుకు రాలేదు. 

మా వద్ద డబ్బులెక్కడివి? 
మరోవైపు ప్రభుత్వం ఈ పనులపై ఒత్తిడి పెంచింది. ఇంజినీరింగ్​అధికారులు, విద్యా శాఖకు టార్గెట్లు పెట్టింది. వారు విద్యా కమిటీల మీద ఒత్తిడి తెచ్చినా పనులు చేయలేమంటూ కమిటీలు చేతులెత్తేశాయి. ఆర్థికంగా ఉన్నట్లయితే తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలలలో చదివించేవాళ్లమని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ బడి డెవలప్​మెంట్​ కోసం పనులు చేస్తే అప్పులపాలవుతున్నామని వారు వాపోతున్నారు. ఇక, కలెక్టర్ ఆదేశాలతో గ్రౌండ్ రియాలిటీ చూడకుండానే జిల్లాస్థాయి అధికారులు, ఇంజినీర్లు పెడుతున్న టార్గెట్లతో మండల విద్యాధికారులు, హెచ్ఎం, ఫీల్డ్ ఇంజనీర్లకు తలనొప్పిగా మారింది. చేసిన పనులకు సగం డబ్బులే వచ్చాయని కొన్ని ఏజెన్సీలు చేతులెత్తేయడం, నష్టాన్ని ఎవరిస్తారని అధికారులతో ఏజెన్సీలు గొడవలు పెట్టుకున్నారు. చేసిన పనులకు రికార్డ్ చేశామని, ఎస్టిమేట్ లో ధరలు తక్కువ ఉంటే తామేమి చేయలేమంటూ ఇంజనీర్లు సైతం పనులను వదిలేశారు. 

ఇసుకకు ధర లేదు
ప్రస్తుతం ఇసుక ధరలు ఎంత పెరిగాయో స్పష్టమవుతూనే ఉంది. కానీ, ‘మన ఊరు–మనబడి’ పనులలో అధికారులు చేసిన ఎస్టిమేట్స్ లో ఇసుక ధర చేర్చకపోవడంతో మరింత నష్టాలు మిగిల్చాయి. బడి పనుల ఎస్టిమేట్ ధరల్లో 20 నుంచి 30 శాతం తేడా ఉందంటూ పనులు ఆపేశారు. పాత ఏజెన్సీలు పనులు వదిలిపెట్టాయి. వీటిని పూర్తి చేసేందుకు కొత్తగా ఎవరూ ముందుకు రావడం లేదు. దాదాపు నాలుగు వేలకుపైగా బడులలో ప్రస్తుతం పనులన్నీ ఆగిపోయాయి.  ప్రస్తుతం 1,210 పాఠశాలల పనులు పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటిని ఇటీవల ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ కాంట్రాక్టర్ల ద్వారా పూర్తి చేయించారు. వారికి కూడా బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు రావడం లేదంటూ కరీంనగర్ తో పాటుగా పలు ప్రాంతాలలో బడులకు సైతం తాళాలు వేశారు.