మణిపూర్ హింసకు బిజెపియే కారణం- ఆదివాసీ గిరిజన, మైనార్టీ సంఘాల నాయకులు 

మణిపూర్ హింసకు బిజెపియే కారణం- ఆదివాసీ గిరిజన, మైనార్టీ సంఘాల నాయకులు 

ముద్ర, ముషీరాబాద్: ప్రశాంతంగా ఉన్న మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన తెగలు, ఇతర ప్రజల మధ్య  ఘర్షణలు సృష్టించి అమాయక ప్రజల హత్యలకు కారణమైందని ఆదివాసి గిరిజన, మైనార్టీ సంఘాల నాయకులు ఆరోపించారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు.

ఆదివాసి గిరిజన సంఘం, ఆవాజ్ , తెలంగాణ గిరిజన సంఘం  ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూసం సచిన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరామ్ నాయక్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, సత్తార్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సామాజిక కార్యకర్త సురేష్ పులిగుజ్జు, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మెస్రం రాజు, శ్రీను, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, గిరిజన సంఘం నాయకులు ఎం బాలు, ఆర్ పాండు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం ఆ రాష్ట్రంలో ఆదివాసీలు, ఇతర ప్రజలను విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు చేసిందని విమర్శించారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం 40 శాతం ఉన్న కూకీ, నాగ, మీజో వంటి 31 గిరిజన తెగలకు స్వయంపాలిత కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని  హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొన్నారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయకుండా ఆదివాసీలకు మోసం చేసిందన్నారు. 2023 లో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం కోసం  54 శాతంగా ఉన్న మెయితి ప్రజలను ఎస్టీ జాబితాలో కలుపుతామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

మెయితి ప్రజలను గిరిజన తెగల జాబితాలో కలపడమంటే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు ఉన్న హక్కులను పూర్తిగా కాలరాయడమేనని గిరిజన తెగలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయని అన్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న 54 శాతం  మెయితి  ప్రజలకు ఆదివాసీ ప్రాంతమైన షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు కల్పించేందుకు బీజేపీ తీర్మానం చేయడం వల్లనే ఘర్షణకు కారణమైందని విమర్శించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో నేరుగా ఇతర ప్రజలకు హక్కులు కల్పించడం రాజ్యాంగంలో అవకాశం లేనందున  40 శాతంగా ఉన్న ఆదివాసీ తెగల జాబితాలో  54 శాతంగా ఉన్న మెయితీ ప్రజలను కలిపేందుకు దొడ్డి దారిన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని అన్నారు. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఆదివాసీలు రాష్ట్రవ్యాప్తంగా  శాంతియుతంగా నిరసనలకు పిలుపునివ్వగా వీటిని అడ్డుకోవడం కోసం బీజేపీ అనుబంధ సంస్థలు,  మెయితీ ప్రజలతో కలసి  పెద్ద ఎత్తున దాడులు చేయడంతో  అక్కడికక్కడే  5 మంది ఆదివాసీ గిరిజనులు హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ ప్రభుత్వ అండదండలు ఉండడంతో బీజేపీ అనుబంధ సంస్థలు, మతోన్మాద మూకలు మరింత రెచ్చిపోయి ఆదివాసీలు  ఉంటున్న గుడాలపై దాడులు చేయడం, హత్యలు, ఇండ్లను తగలబెట్టడం వంటి హింసాకాండ రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయని  అన్నారు. ఆదివాసి గిరిజనుల్లో ఉగ్రవాదులు ఉన్నారని, వారందరూ మతం మారారని నిందలు వేస్తూ నిర్దాక్షిణ్యంగా అమాయక గిరిజనులను కాల్చి చంపడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

ఇప్పటివరకు113 మంది చనిపోయారని అధికారికంగా చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదని 500 మందికి  పైగానే హత్యలు, ఆర్మీ కాల్పుల్లో చనిపోయి ఉంటారని  ఆందోళన వ్యక్తం చేశారు. 50 వేల మందికి పైగా గిరిజనులు సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారారని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధితుల పక్షాన అండగా నిలిచి శాంతిని నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయకుండా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో సైతం హింస చెలరేగడం ఆందోళన కలుగుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్దుకొనే విధంగా గిరిజన తెగల్లో మేయితీ ప్రజలను కలుపుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో  గిరిజన తెగలు, ఇతర ప్రజలతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. .