ఏసీబీ కి చిక్కన మార్కెటింగ్ శాఖ అధికారి శారధ

  • పత్తి వ్యాపారిని లంచం కోసం వేధించి కటకతాలపాలు
  • సొమ్మసిల్లినట్లు నాటకం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాలలో ఓ అవినీతి మహిళా అధికారి ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. సోమవారం విశ్వేశ్వర్ రావు అనే పత్తి వ్యాపారి నుంచి  65 వేలు లంచం తీసుకున్న మార్కెటింగ్ శాఖ కార్యదర్శి శారధ ను కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంచిర్యాల శివారులోని గద్దెరాగడి వద్ద పత్తి క్రయ, విక్రయాల వ్యాపారం చేయడానికి లైసెన్సు కోసం విశ్వేశ్వర రావు అనే వ్యక్తి మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించి నివేదిక పంపాలని ఉన్నతాధికారులు శారధకు సూచించారు. ఇన్స్పెక్షన్ రిపోర్టు అనుకూలంగా ఇవ్వడానికి లక్ష రూపాయల లంచం కావాలని విశ్వేశ్వర్ రావును డిమాండ్ చేసింది. విశ్వేశ్వర రావు లక్ష రూపాయలను శారదకు ముట్ట చెప్పాడు. పత్తి క్రయ, విక్రయాలకు అనుమతి వచ్చినప్పటికీ  మరో లక్ష రూపాయలు ఇవ్వాలని విశ్వేశ్వరరావును శారద వేధింపులకు గురి చేసింది. 15 వేల రూపాయలు శారదకు అప్పజెప్పిన విశ్వేశ్వరరావు ఎలాగైనా ఆమె కు బుద్ధి చెప్పాలని ఈనెల 14వ తేదీన కరీంనగర్ లోని ఏసిబి అధికారులను ఆశ్రయించాడు.

ఒప్పందం ప్రకారం సోమవారం శారదకు డబ్బులు ఎలా ఇవ్వాలో విశ్వేశ్వర్ రావుకు ఏసీబీ అధికారులు శిక్షణ ఇచ్చారు. మంచిర్యాల మెడికల్ కాలేజ్ పక్కన మార్కెటింగ్ ఆఫీస్ లో ఉన్న శారద కు 65వేల లంచం ను అందజేశారు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారుల రంగ ప్రవేశంతో ఒక్కసారిగా ఖంగుతిన్న శారద సొమ్మసిల్లినట్లు నాటకం ఆడింది. ఆఫీసు ముందు ఉన్న ఆర్.ఎం.పి.ఒకరు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి ఏమి కాలేదని ఏసీబీ అధికారులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శారద లంచం తీసుకున్నట్లు సాంకేతికంగా నిర్ధారణ అయ్యిందని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మీడియా కు తెలిపారు. అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఆయన వెల్లడించారు.