కబ్జా కోరల్లో మర్రికుంట

కబ్జా కోరల్లో మర్రికుంట
  • ఎఫ్ టి ఎల్ పరిధిలో ప్లాట్లు, ఇండ్ల నిర్మాణం
  • ఇండ్లను కూల్చివేయాలని రెవెన్యూ అధికారుల నోటీసులు
  • ట్యాంక్ బండ్ నిర్మాణంతో బయటపడ్డ అక్రమాలు

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి మున్సిపల్ పరిధిలోని మర్రికుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది . వనపర్తిలో కొందరు రియల్టర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరుతూ ప్రభుత్వ భూముల పక్కనే ఉన్న పట్టా భూములను కొనుగోలు చేసి ప్రభుత్వ భూములను కలిపి అమ్ముకోవడం ఆనవాయితీగా మారింది. అందులో భాగంగానే కొన్నేళ్ళ క్రితమే మర్రికుంటను కబ్జా చేసేందుకు రియల్టర్లు పక్కనే ఉన్న పట్టా భూమిని కొనుగోలు చేసి మరి కుంటలో బఫర్ జోన్ , ఎఫ్డీఎల్ పరిధిలో ప్లాట్లు వేసి విక్రయించారు. అధికారులు కూడా కబ్జాదారుల కాసులకు ఆశపడి ఎఫ్.టి.ఎల్,  బఫర్ జోన్లలో అనుమతించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వీరి అక్రమాలను పసిగట్టలేక ప్లాట్లుకొని ఇండ్లను కూడా నిర్మించుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కుంటకట్టను ట్యాంకుబండగా మార్చి, కుంటలో నీటిని నిల్వ ఉంచితే ఆ పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతాయని భావించారు.

అందుకు నిధులను కూడా మంజూరు చేసి పనులను ప్రారంభించారు. కుంటలో పేరుకుపోయిన మట్టిని ఇసుకను తొలగించి నీటి నిల్వకు అనుకూలంగా చేస్తున్నారు. ఇదే సమయంలో అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల హద్దులను నిర్ణయించి, ఆ పరిధిలో నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని నోటీసులు కూడా అందజేశారు. దీంతో అక్కడ ప్లాట్లు కొని ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రియల్ వ్యాపారం చేస్తూ కోట్లను గడించిన వారు మాత్రం  కిమ్మనడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ల పరిధిలో ప్లాట్లను వేయరాదని,  విక్రయాలు చేయకూడదనే నిబంధన ఉండడంతో అధికారులు వారిని తొలగిం చేందుకు సిద్ధమయ్యారు.  అందుకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు లక్షల్లో, ఇండ్లను నిర్మించుకున్న వారు కోట్లలో నష్టపోతుండడంతో తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు  కోరుతున్నారు.

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నల్లచెరువు, ఈదుల చెరువులను, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గతంలో ట్యాంకుబండలుగా మార్చారు.  వనపర్తిలో వేసవి వస్తేనే బోర్లలో నీటిమట్టం తగ్గి వనపర్తి జిల్లా కేంద్రంలో తాగునీటికి కటకటగా ఉండగా, ఈ చెరువులను అభివృద్ధి చేసి నీటి నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సమస్య తీరింది. అలాగే మర్రికుంటను కూడా ట్యాంక్ బండ్ గా మార్చి నీటిని నిల్వ ఉంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి నిధులు మంజూరు చేయించడంతో పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. అక్రమ రియల్ వ్యాపారుల నుండి తమకు డబ్బు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయమై తాసిల్దార్ రాజేందర్ గౌడ్ ను వివరణ కోరగా ఎఫ్టిఎల్,  బఫర్ జో నులలో ప్లాట్లు వేసి విక్రయించరాదని, కొనుగోలు కూడా చేయరాదని, అలా చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిన, అమ్మిన అవి చెల్లవని అన్నారు.  వనపర్తి మరి కుంటలో  ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో ఇండ్లను నిర్మించిన పదిమందికి కూల్చి వేసుకోవాలని నోటీసులు ఇవ్వడం జరిగిందని, అలాగే ప్లాట్లను కొనుగోలు చేసిన వారు కూడా నీటి నిల్వ ఉంచడంతో కోల్పోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.