తప్పు చేస్తే పెద్దపెద్దవాళ్లే జైలుకు వెళ్లారు... కేటీఆర్ ఎంత..?

తప్పు చేస్తే పెద్దపెద్దవాళ్లే జైలుకు వెళ్లారు... కేటీఆర్ ఎంత..?
  • ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తప్పు చేస్తే పెద్దపెద్దవాళ్లే జైలుకు వెళ్లారు... కేటీఆర్ ఎంత? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర సభలో మంత్రి మాట్లాడుతూ అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి లేదన్నారు. కవితకు బెయిల్ వస్తుందని తెలిసి రెండ్రోజులు ముందే ఢిల్లీకి వెళ్లారనిబీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు.మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవితకు బెయిల్ వస్తుందని ముందే తెలియడంతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు రెండు రోజులు ముందే ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను మూసీ నది పక్కన చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని  అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఉద్యమం సమయం నుంచి నాటకాలు ఆడుతూనే ఉన్నారని మండిపడ్డారు.ఉద్యమం సమయంలో తనకు అగ్గిపెట్టె దొరకలేదని హరీశ్ రావు అన్నారని... ఆ రోజు మనం నమ్మి ఉండవచ్చు... కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని... అలా వస్తే వారి మీది నుంచి డోజర్లను పోనిస్తామని హెచ్చరించారు. తనను జైలుకు పంపిస్తే యోగా చేసి, పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెబుతున్నారని, కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. పదేళ్లు సమయం ఇచ్చినా మూసీని ప్రక్షాళన చేయని బతుకు ఎందుకని ధ్వజమెత్తారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి అన్నారు.