యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
  • రహదారుల, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ముద్ర ప్రతినిధి, నల్గొండ:తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టాస్క్, టి ఎఫ్ ఎం సి, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగం పెరిగిపోతున్న తరుణంలో నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున సుమారు 13000 మందికి ఉద్యోగాలు కల్పించేలా 127 కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ జాబ్ మేళా ద్వారా లక్ష రూపాయల కనీసం వేతనం మొదలుకొని, 12 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి జీతం వచ్చేలా కంపెనీలు ముందుకు వచ్చాయని, ముఖ్యంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అరవింద వంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్, సుభద్ర ఫౌండేషన్ ల ద్వారా గతంలో జిల్లాలో 18,410 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, 3 లక్షల నుండి 15 లక్షల వరకు వేతనాలు ఇప్పించామని, అంతేకాక జేఎన్టీయూలో జాబ్ మేళా నిర్వహించి 10000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నదని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న శక్తి సామర్ధ్యాలను బయటకు తీసి బాగా కష్టపడి చదివి ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇకపై ప్రతినెల ఒక జాబ్ మేళాలను నిర్వహిస్తామని, వచ్చే నెల ఎన్జీ కళాశాలలో జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు మంత్రి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ బ్రాంచ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ , ఆంపి థియేటర్, ఇంజనీరింగ్, టెక్నాలజీ నూతన భవనాలను ప్రారంభించారు. తెలంగాణలోనే మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాన్ని మంచి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో చేపట్టే ఇతర భవనాల కోసం 100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలోనే వీటి పనులు చేపడతామన్నారు.

జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా ఒక మంచి అవకాశం అని, స్థానిక ప్రతిభకు తగ్గట్టుగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఇక్కడి యువతకు దొరికిందని, అందరూ గర్వపడే విధంగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని యువత నైపుణ్యాలను వెలికి తీయడంలో భాగంగా మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని తెలిపారు.టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ 127 కంపెనీలతో అతిపెద్ద జాబ్ మేళాను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఎక్కడ లేవని  అన్నారు.

127 కంపెనీల ద్వారా 12743 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని ,లక్ష రూపాయలు మొదలుకొని , 12 లక్షల వరకు ప్యాకేజీ ఇచ్చే విధంగా కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు . ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, విశ్వవిద్యాలయం ఉపకులపతి సిహెచ్ గోపాల్ రెడ్డి, టి ఎఫ్ ఎం సి, సి ఈ ఓ సత్యనారాయణ, ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.